Begin typing your search above and press return to search.

చిర‌కాల మిత్రుడికి ఆ సీఎం సీరియ‌స్ వార్నింగ్

By:  Tupaki Desk   |   28 Oct 2017 4:28 AM GMT
చిర‌కాల మిత్రుడికి ఆ సీఎం సీరియ‌స్ వార్నింగ్
X
సెక్యుల‌రిజం పేరుతో బీజేపీను దేశంలోని రాజ‌కీయ పార్టీల‌న్నీ దాదాపుగా బ్యాన్ అన్న రీతిలో వ్య‌వ‌హ‌రించిన వేళ‌.. ఆ పార్టీకి అండ‌గా నిలిచిన రాజ‌కీయ పార్టీ ఏదైనా ఉందంటే అది శివ‌సేన మాత్ర‌మే. ఏ ప‌రిస్థితుల్లో అయినా.. ఎన్ని విమ‌ర్శ‌ల్ని బీజేపీ ఎదుర్కొన్నా అండ‌గా ఉన్నానంటూ వెన్నంటి నిలిచిన పార్టీగా శివ‌సేన‌ను చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ రోజు మోడీని చూపించి చంద్ర‌బాబు మొద‌లుకొని ప‌లు ప్రాంతీయ పార్టీ అధినేత‌లు మొద‌లుకొని కొన్ని జాతీయ పార్టీ అధినేత‌లు సైతం బీజేపీ వెన్నంటి ఉన్నారు.

కానీ.. ఇదే పార్టీకి ఒక‌ప్పుడు ఇప్పుడున్న ప‌రిస్థితికి భిన్న‌మైన ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. బీజేపీ గ‌తాన్ని చూస్తే.. ఆ పార్టీ స‌ర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక్క‌టంటే ఒక్క ఓటు త‌గ్గి రాజ్యాధికారాన్ని పోగొట్టుకోవాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఈ రోజు దేశంలోనే త‌మ‌కు తిరుగులేద‌ని.. ప్ర‌త్యామ్నాయం అస‌లే లేదంటూ జ‌బ్జ‌లు చ‌రుచుకుంటున్న బీజేపీకి ఒక‌ప్పుడు ఆ పార్టీతో దోస్తీ చేసేందుకు సైతం వ‌ణికిపోయేవారు. ఎవ‌రిదాకానో ఎందుకు ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం బీజేపీతో తెగ తెంపులు చేసుకోక‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ఫీలైన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్న చంద్ర‌బాబు.. అప్ప‌ట్లో ఇదే మోడీ తీరును త‌ప్పు ప‌ట్టి మ‌రీ దోస్తానాకు క‌టీఫ్ చెప్పటాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఈ రోజున మోడీని ఇంద్రుడు.. చంద్రుడు అని బాబు కీర్తిస్తున్నారు కానీ ఒక‌ప్పుడు ఇదే మోడీ వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అయితే.. దీనికి భిన్నంగా బీజేపీకి ఎలాంటి ప‌రిస్థితి ఎదురైన‌ప్ప‌టికీ ఆ పార్టీ వెంటే ఉంటూ.. వారి వాద‌న‌ను బ‌లంగా స‌మ‌ర్థించిన రాజ‌కీయ ప‌క్షాల్లో శివ‌సేన ముందు ఉంటుంది. అలాంటి ఆ పార్టీకి బీజేపీకి మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న విష‌యం తెలిసిందే.

ఆ మ‌ధ్య‌న జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మోడీ కార‌ణంగా బీజేపీ.. శివ‌సేన‌ల స్నేహాం ప‌లుచ‌న అయ్యింది. మోడీ తీరుపై సేన అధినేత‌కు తీవ్ర అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ దాన్ని మ‌న‌సులోనే ఉంచుకుంటున్నారే త‌ప్పించి బీజేపీకి దూరంగా జ‌ర‌గ‌టం లేదు. కానీ.. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా మోడీపై ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తూ క‌మ‌ల‌నాథుల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తున్నారు.

మోడీ పాల‌న‌ను సైతం నేరుగా విమ‌ర్శిస్తూ వ్యాఖ్య‌లు చేసిన వైనం ఇప్పుడు బీజేపీ నేత‌ల్లో కొత్త ఆగ్ర‌హంగా మారింది. శివ‌సేన తీరును త‌ప్పు ప‌డుతూ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఫైర్ అయ్యారు. క‌లిసి ఉన్న‌ట్లే ఉండి త‌మ మాట‌ల‌తో క‌ష్టాలు తెస్తున్న చిర‌కాల మిత్రుడికి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చేశారు. బీజేపీతో క‌లిసి మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన శివ‌సేనపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ముఖ్య‌మంత్రి.. ప్ర‌భుత్వంలో కొన‌సాగాలో లేదో నిర్ణ‌యించుకోవాలంటూ సేన చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేకు తేల్చి చెప్పారు.

ఇటీవ‌ల శివ‌సేన నేత రౌత్ మాట్లాడుతూ మోడీ పాల‌న ఏ మాత్రం బాగోలేదంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఫ‌డ్న‌వీస్ తీవ్రంగా స్పందించారు. శివ‌సేన రెండు నాల్క‌ల ధోర‌ణికి పాల్ప‌డుతుంద‌న్నారు. తాము తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యాన్ని శివ‌సేన వ్య‌తిరేకిస్తోంద‌ని.. ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇవ్వాల‌నుకుంటే వారు ఇవ్వొచ్చ‌ని కానీ ప్ర‌భుత్వంలో ఉండి ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌టం స‌రికాద‌ని ఫ‌డ్న‌విస్ తేల్చి చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు.. దివంగ‌త బాల్‌ ఠాక్రే తీరును ఫ‌డ్న‌వీస్ గుర్తు చేశారు. బాల్ ఠాక్రే ఎప్పుడు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేక దృష్టితో చూడ‌లేద‌ని గుర్తు చేశారు. కానీ.. ఆయ‌న తీరుకు భిన్నంగా ఇప్ప‌టి పార్టీ నేత‌లు తామే గొప్ప అని భావిస్తూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌న్నారు. ప్ర‌భుత్వంలో కొన‌సాగే అంశంపై పార్టీ అధినేత‌గా ఉద్ద‌వ్ ఏదో ఒక నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల సేన నేత రౌత్ ఒక టీవీ చాన‌ల్ లో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి దేశాన్ని పాలించే స‌త్తా ఉందంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌టం మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. దీంతో.. ఇంత‌కాలం ఉగ్గ‌బ‌ట్టుకున్న‌ట్లుగా ఉన్న ఆయ‌న‌.. ఈసారి ఓపెన్ అయి క‌టీఫ్ కు సైతం సిద్ధ‌మ‌న్న సిగ్న‌ల్ ఇచ్చేశారు. మ‌రి.. దీనికి సేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.