Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రికి అంకుశం సినిమాలో రామిరెడ్డి పాత్రకు పట్టిన గతేనట

By:  Tupaki Desk   |   13 Feb 2022 1:30 AM GMT
ఏపీ మంత్రికి అంకుశం సినిమాలో రామిరెడ్డి పాత్రకు పట్టిన గతేనట
X
గడిచిన కొంతకాలంగా టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత.. మాజీ మంత్రి కమ్ క్రిష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు మౌనంగా ఉండటం తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున రాజకీయ పరిణామాలు జరుగుతున్నా.. ఆయన నోరు విప్పలేదు. టీడీపీలో చురుగ్గా ఉండే దేవినేని ఉమ.. ఎందుకు మౌనంగా ఉన్నారు? పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని నోటికి వచ్చినట్లుగా తిట్టిపోస్తున్నా.. సరైన కౌంటర్ ఎందుకు ఇవ్వటం లేదు? దేవినేనికి ఏమైంది? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. వాటన్నింటికి సమాధానాలు ఇస్తూ.. మంత్రి కొడాలి నానిపై ఘాటుగా రియాక్టు అయ్యారు దేవినేని.

విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి కొడాలిని ఉద్దేశించి మాట్లాడే ప్రతి మాట చివర ‘‘రా’’ అన్న పదాన్ని అస్సలు మిస్ చేయని ఆయన.. బూతులు తిట్టేందుకు తనకు సంస్కారం వస్తోందంటూనే తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టేశారు. సన్నాసి.. బడుద్దాయ్.. క్యాసినో మంత్రి.. పేకాట మంత్రి.. ఇలా అది ఇది అన్న తేడా లేకుండా తన నోటికి పెద్ద ఎత్తున పని చెప్పారు. ఒకప్పుడు చంద్రబాబు కాళ్లు పట్టుకొని ఉద్యోగం తెచ్చుకున్నాడని.. ఇప్పుడు జగన్ కాళ్లు పట్టుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పౌర సరఫరాల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న కొడాలి నాని.. నోరు పారేసుకునే బదులు.. అదే పనిగా బూతులు తిట్టే బదులు.. మొదట తన శాఖ మీద పట్టు తెచ్చుకోవాలన్నారు. తాను మంత్రిగా ఉన్న వేళ చంద్రబాబు పుణ్యమా అని ఐదేళ్లలో రూ.60వేల కోట్లకు పైనే నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టులు చేపట్టామని.. కొడాలి నాని ఏం చేశారో చెప్పాలన్నారు. సన్నాసి మంత్రిగా.. చవట.. దద్దమ్మ లాంటి మాటల్ని అదే పనిగా ప్రస్తావిస్తూ ఆయన విరుచుకుకు పడ్డారు.

2024లో టీడీపీ అధికారంలోకి వచ్చినతర్వాత అంకుశం సినిమాలో రామిరెడ్డి పాత్రకు జరిగినట్లే జరుగుతుందని.. ప్రజలు ఆయన్ను వదిలిపెట్టరంటూ ఘాటు హెచ్చరిక చేశారు. ఆయనకు ఆ గతి పట్టటం ఖాయమని.. కచ్ఛితంగా వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని పొగరు ప్రజలు అణిచేస్తారన్నారు.

రెండుసార్లు చంద్రబాబు భిక్షతో టికెట్ తెచ్చుకున్నారని.. అందుకు తానే సాక్ష్యమన్నారు. జిల్లాల గురించి.. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత కొడాలి నానికి లేదన్నారు. ఆయన మాట్లాడుతున్న భాష విని బయట ప్రాంతాల వారు ఆయన్ను పశువుగా చూస్తున్నారన్నారు. ఒకప్పుడు క్రిష్ణా జిల్లాకు మంచి పేరు ఉందని.. ఇప్పుడు ఆ జిల్లా వాసులంతా కొడాలి నాని భాషతో సిగ్గుపడుతున్నారన్నారు.

కేసులు పెడితే భయపడరని.. అంత పెద్ద వయసు ఉన్న చంద్రబాబును ఉద్దేశించి అన్నేసి మాటలు ఎలా అంటావని ప్రశ్నించిన దేవినేని.. అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? చంద్రబాబు వయసు ఎంత? నీ వయసు ఎంత? అని ప్రశ్నించారు. తన తండ్రి కాలం చేయటం.. ఆ తర్వాత తనకు కరోనా రావటంతో తాను మౌనంగా ఉండాల్సి వచ్చిందని.. ఆ సమయంలో కొడాలి నాని మాటల్ని విన్న ప్రతిసారీ రక్తం మరిగిపోయేలా ఉండేదంటూ మండిపడ్డారు. సన్న బియ్యం ఇప్పించే స్థాయిలో లేనివారు.. వడ్లు అమ్మి రైతులకు డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్న కొడాలి..ముందు తనకు అప్పగించిన శాఖ మీద పట్టు సాధించాలన్నారు. కాస్తలేటుగా వచ్చినా లేటెస్టు తిట్లతో మంత్రి కొడాలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని చెప్పక తప్పదు.