Begin typing your search above and press return to search.

దేవినేని అవినాష్ ఏం చెప్పిండు భయ్

By:  Tupaki Desk   |   21 Oct 2015 6:12 AM GMT
దేవినేని అవినాష్ ఏం చెప్పిండు భయ్
X
చేయాల్సిందంతా చేసేసి.. అంతా మీరే చేసేశారంటూ అనేయటం ఏపీ కాంగ్రెస్ నేతలకే చెల్లింది. ఓ పక్క తెలంగాణలో రాష్ట్ర విభజనకు కారణం తమదేనని చంకలు గుద్దుకొని.. తాము కష్టపడి తెలంగాణ తీసుకొస్తే.. టీఆర్ ఎస్ అధికారాన్ని చేజిక్కించుకుందన్న ఆవేదనను వ్యక్తం చేసి.. 2019 నాటికి తెలంగాణ ప్రజలు తమకు అనుకూలంగా నిర్ణయం ఇవ్వటం ఖాయమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభజన క్రెడిట్ అంతా తమదేనని జబ్బలు చరుచుకుంటే.. ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించిన నేపథ్యంలో.. ఆయన రాకపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ ఏపీ పర్యటనను తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు ప్రకటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అమరావతి రాకకు స్వాగతం పలుకుతూ తెలుగు తమ్ముళ్లు.. విజయవాడలో భారీ ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిన కేసీఆర్ ను శంకుస్థాపనకు ఆహ్వానించటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ తప్పుపట్టారు.

ఓపక్క తెలంగాణను తామే తీసుకొచ్చినట్లు సోదర కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటుంటే.. సిగ్గుతో తలదించుకొని.. తమ చేతకానితనానికి చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన ఏపీ కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ మీద పడటం ఏమిటో? అంటే.. విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్టంతో ఏపీ కాంగ్రెస్ నేతలు కోట్లాటలు కోరుకుంటున్నారా? నిజంగా పౌరుషం ఉంటే.. అవినాష్ లాంటి నేతలు విభజనకు కారణమైన సోనియా.. రాహుల్ గాంధీలను నిందించాలే తప్పించి.. ఏపీ రాజధాని శంకుస్థాపనకు వస్తున్న అతిధిని అడ్డుకోవాలన్న పిలుపునివ్వటమేమిటి అవివేకంగా..?