Begin typing your search above and press return to search.

చినబాబును మాటలతో ‘పిసికేసిన’ అవినాశ్

By:  Tupaki Desk   |   16 Sep 2016 7:47 AM GMT
చినబాబును  మాటలతో ‘పిసికేసిన’ అవినాశ్
X
ప్రపంచంలో ఎవరినైనా పడేసేదే.. పొగడ్తే. ఎంతటోడైనా పొగడ్తకు పడిపోవాల్సిందే. ఆ విషయాన్ని ఎంత బాగా అర్థం చేసుకొని.. సందర్భానుసారంగా మాటల్ని ఉపయోగిస్తారో అలాంటోళ్లకు తిరుగు ఉండదు. లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. తన ఎంట్రీ లేటెస్ట్ గా ఉండాలన్నట్లుగా తన మాటలతో చెప్పకనే చెప్పేశారు దేవినేని నెహ్రు తనయుడు దేవినేని అవినాశ్. పార్టీలోకి అడుగు పెడుతూనే.. ఈ కుర్ర నేత పొగడ్తలతో పిసికిన పిసుకుడికి చినబాబు ఫిదా కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

తెలుగుదేశం అంటేనే ఒంటి కాలి మీద లేచే దేవినేని నెహ్రు కాలానికి తగ్గి.. సైకిల్ ఎక్కేందుకు డిసైడ్ అయ్యారు. ఆయన ఓకే అన్నా.. ఆయన్ను ఏపీ ముఖ్యమంత్రి కమ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఓకే చేయాలి. అందుకు చేయాల్సిన ప్రయత్నాల్ని చేసి.. బాబు దగ్గర ఎంట్రీ పాస్ తీసుకున్న నెహ్రు.. తాజాగా అధికారికంగా పార్టీలో చేరిపోవటం తెలిసిందే. కొడుకు అవినాశ్ తో సహా పార్టీలో చేరిన సందర్భంగా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

యువనేతగా అవినాశ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందుకు తగ్గట్లే మారిన పార్టీకి తగ్గట్లుగా మాట్లాడిన ఆయన.. తన మాటలతో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో చినబాబు లోకేశ్ ను ఎవరూ పొగడనంత భారీగా పొగిడేశారు. తాజాగా ఆయన చేసిన పొగడ్తలతో రానున్న రోజుల్లో చినబాబు టీంలో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందంటున్నారు.

పెద్దలందరికి చంద్రబాబు అన్న అయితే.. యువతకు లోకేశ్ అన్న అని.. ఆయన మనసున్న నేత అని వ్యాఖ్యానించారు. తన తండ్రి దేవినేని నెహ్రుకు ఎన్టీఆర్ అవకాశం కల్పించారని.. తాజాగా తమకు చంద్రబాబు ఉన్నారని.. తమ భవిష్యత్ కు ఢోకా లేదన్న అవినాశ్.. బాబు పాలనలో ప్రజలెంతో సుఖంగా ఉన్నారన్నారు. లోకేశ్ అన్నకు మంచి మనసు ఉందన్న అవినాశ్.. ‘‘ఆయనకు ఎలాంటి భేషజు లేవు. మా యూత్ కి అన్న లోకేశ్. మరో 30 ఏళ్లు కృష్ణా జిల్లా గడ్డపై టీడీపీ జెండా ఎగురుతుంది’’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును పొగిడేస్తూనే.. చినబాబు లోకేశ్ ను తన మాటలతో ఎత్తేసిన తీరు ఇప్పుడు ఆసక్తిర అంశంగా మారింది.