Begin typing your search above and press return to search.

సీనియ‌ర్‌కు మొండి చేయి.. జూనియ‌ర్ కు బెజ‌వాడ తూర్పు ఎమ్మెల్యే సీటు!

By:  Tupaki Desk   |   4 Jan 2023 11:30 PM GMT
సీనియ‌ర్‌కు మొండి చేయి.. జూనియ‌ర్ కు బెజ‌వాడ తూర్పు ఎమ్మెల్యే సీటు!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకునే వ్యూహంలో భాగంగా సీఎం జ‌గ‌న్ వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్నారు. ఇప్ప‌టికే శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గానికి దువ్వాడ శ్రీనివాస్‌ను ఖ‌రారు చేసిన ఆయ‌న ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌ల సంద‌ర్భంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్నారు. తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల వరకూ వైసీపీకి తిరుగులేదని సీఎం జగన్‌ అన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లాలని నేతలకు సూచించిన సీఎం.. చేసిన సంక్షేమాన్ని వివరించి అందరి ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో అవినాష్ బాగా ప‌నిచేస్తున్నార‌ని సీఎం జ‌గ‌న్ కితాబునిచ్చారు. అనేక స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తున్నార‌ని చెప్పారు.

అవినాష్ ప‌నితీరు బాగుంద‌న్న సీఎం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు కోసం ప‌నిచేయాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు మనమంతా గడప గడపకు అంటూ ప్రజలతో మమేకవుతూ.. ప్రజల్లోకి వెళ్తున్నాం. మనం చేసే పనులను ప్రజలకు తెలుపుతూ.. వారి ఆశీస్సులు తీసుకోవాలి, అందుకోసం ప్రతి ఇంటికీ వెళ్లాలి. వారికి మనం ఎలాంటి సంక్షేమాన్ని అందిస్తున్నామో తెలియజేయాలి. ఈ సారి మనం ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల వరకూ వైసీపీకి తిరుగులేదు.`` అన్నారు.

సీనియ‌ర్ నేత‌కు మొండిచేయి!

ఇదిలావుంటే.. తూర్పునియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని మ‌రో సీనియ‌ర్ నేత ఆశ‌లు పెట్టుకున్నారు.గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వ‌చ్చిన య‌ల‌మంచిలి ర‌వి.. 2024 ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇస్తాన‌న‌ని హామీ ఇచ్చిన‌ట్టు రవి వ‌ర్గం అప్ప‌ట్లో ప్ర‌చారం చేసింది. అయితే.. ఇప్పుడు ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేశారు. కొన్నాళ్లుగా ర‌వి.. పార్టీలోనూ యాక్టివ్‌గా ఉండ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.