Begin typing your search above and press return to search.

దేవినేని సైకిల్ సవారీకి ముహూర్తం దగ్గరపడిందట

By:  Tupaki Desk   |   29 Aug 2016 6:26 AM GMT
దేవినేని సైకిల్ సవారీకి ముహూర్తం దగ్గరపడిందట
X
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత - మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ఆయన చేరిక వ్యవహారం రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నా అందుకు ముహూర్తం మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓకే చెప్పినట్లు సమాచారం. విజయవాడలో కార్యకర్తలతో భేటీ అయిన దేవినేని ఈ మేరకు వారిని తన నిర్ణయం చెప్పారని అంటున్నారు. త్వరలోనే చేరిక తేదీ ప్రకటిస్తారని సమాచారం.

కాగా గత కొంతకాలంగా దేవినేని టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. పుష్కరాలకు ముందు ఆయన టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకటరావుతోనూ భేటీ అయ్యారు. అయితే, అప్పటికి చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన చేరిక వ్యవహారం పుష్కరాల తరువాతకు వాయిదా పడింది. పుష్కరాల హడావుడి నుంచి చంద్రబాబు బయటపడడంతో ఇప్పుడు దేవినేని వ్యవహారంపై దృష్టి పెట్టారని.. రాజధాని ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నేతలను అంగీకరించాలని కృష్ణా టీడీపీ నేతలకు ఆయన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. కాగా నెహ్రూ చేరికను బోడె ప్రసాద్ - వల్లభనేని వంశీ - గద్దె రామ్మోహన్ వంటి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా సీనియర్ల అవసరం మనకుంది అంటూ చంద్రబాబు వారికి నచ్చజెప్పినట్లు సమాచారం. ఇటీవల నెహ్రూ సోదరుడు బాజీ మృతి చెందినప్పుడు టీడీపీ యువ నేత లోకోశ్ - ఏపీ మంత్రి దేవినేని ఉమ తదితరులు ఆయన్ను ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పటికే నెహ్రూ చేరిక ఖరారైనట్లు చెబుతున్నారు.

కాగా నెహ్రూ ఇంతకుముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించగా అక్కడా ఆయనకు వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా ప్రత్యర్థి వంగవీటి రాధా నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయనకు మద్దతుగా కొడాలి నాని కూడా నెహ్రూ రాకను వ్యతిరేకించినట్లు చెబుతారు. దీంతో వారి మాటకు తలొగ్గి నెహ్రూను వదులుకున్నారని.. లేదంటే ఈసరికే ఆయన వైసీపీలో ఉండేవారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నెహ్రూ అంతకుముందు టీడీపీలోనే చాలాకాలం ఉణ్నారు. 1995లో టీడీపీని వీడి కాంగ్రెస్‌ లో చేరారు. మళ్లీ ఇప్పుడాయన పాత గూటికే రానున్నట్లు తెలుస్తోంది.