Begin typing your search above and press return to search.

ఉమ చెప్పిన జగన్ రూ.10వేల కోట్ల ముచ్చట!

By:  Tupaki Desk   |   10 Oct 2016 9:53 AM GMT
ఉమ చెప్పిన జగన్ రూ.10వేల కోట్ల ముచ్చట!
X
ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఇటీవల దేశ వ్యాప్తంగా వెల్లడించిన నల్లధనం వ్యవహారంలో జగన్ దే ఎక్కువ మొత్తంగా ఆయన ఆరోపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వెల్లడించిన రూ.65వేల కోట్ల నల్లధనంలో హైదరాబాద్ కు చెందిన ఒక్కరే రూ.10వేల కోట్ల ఆస్తుల్ని ప్రకటించినట్లుగా వచ్చిన వార్తల సంగతి తెలిసిందే. తమ నల్లధనాన్ని వెల్లడించిన వారి వివరాల్నిప్రభుత్వం రహస్యంగా ఉంచుతుంది. మరి.. ఇలాంటి రహస్య సమాచారం మంత్రి దేవినేని ఉమకు ఎలా తెలిసిందన్నది ఒకటైతే..రూ.10వేల కోట్లు జగన్ కు చెందినవిగా దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు.

బెజవాడలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. చట్టాన్ని అడ్డుగా పెట్టుకొని తనకున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. జగన్ కు జిల్లాల వారీగా ఉన్న భూముల వివరాల్ని ప్రకటించారు. రూ.33.93వేల కోట్ల విలువైన 94వేల ఎకరాల భూములు.. 1.81లక్షలఎకరాల మేర గనులు బినామీ పేర్ల మీద ఉన్నట్లుగా చెప్పారు.

ఓపక్క కేంద్ర ప్రభుత్వం అక్రమ ఆస్తులకు సంబంధించిన వివరాల్ని వెల్లడించి.. జరిమానా మొత్తాన్ని కట్టేస్తే ఆ వివరాల్ని గుట్టుగా ఉంచుతానని చెప్పిన దానికి భిన్నంగా రూ.10వేల కోట్లకు సంబంధించి దేవినేని ఉమాకు ఆ వివరాలు ఎవరు ఇచ్చినట్లు? ఆయనకు ఆ వివరాలు ఎలా అందినట్లు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. ఉమా ఆరోపిస్తున్నట్లుగా జగన్ కు సంబంధించినవే అన్నది నిజమైతే.. ఆ వివరాల్ని కన్ఫర్మ్ చేసేలా పత్రాల్ని ఎందుకు చూపించలేకపోతున్నట్లు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/