Begin typing your search above and press return to search.

దేవినేని చెప్పిన దాన్లో పాయింట్ ఉందా?

By:  Tupaki Desk   |   23 Jun 2016 7:32 AM GMT
దేవినేని చెప్పిన దాన్లో పాయింట్ ఉందా?
X
కృష్ణా జలాల వివాదం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న పంచాయితీ తెలిసిందే. ఈ వ్యవహారం మీద గంటల కొద్దీ కూర్చొని మాట్లాడుకున్నా ఒక పట్టాన తెగకుండా ఉండటమే కాదు.. మరిన్ని పీటముడులు పడటం.. ఇద్దరి మధ్యన పంచాయితీని తేల్చటం తమ వల్ల కాదంటూ కేంద్రం సైతం తల పట్టుకోవటం చూసినప్పడు ఇద్దరి మధ్య లొల్లి ఎంత క్లిష్టమైనది.. కష్టమైనదో ఇట్టే అర్థం కాక మానదు.

ఈ సందర్భంగా ఏపీ మంత్రి దేవినేని ఉమ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో దిగువన ఉన్న ప్రాంతానికి చెందిన రాష్ట్రం ఏమీ చేయలేకున్నా.. ఎగువనున్న రాష్ట్రం మా మీద ఆరోపణలు చేయటం సరి కాదంటూ ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేశారు. కర్ణాటక.. మహారాష్ట్రలు తమతో కలిసి వస్తుంటే.. ఏపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందంటూ తెలంగాణ మంత్రి హరీశ్ చేస్తున్న వ్యాఖ్యలకు దేవినేని బలంగా కౌంటర్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేసి భావోద్వేగానికి గురయ్యేలా కొన్ని మాటలు చెప్పుకొచ్చారు.

‘‘తెలంగాణకు చెందిన ఒక్క నీటి చుక్క కూడా ఏపీ కోరుకోవటం లేదు. ఏపీ కన్ను పొడవాలని భావిస్తూ.. నల్గొండ.. ఖమ్మం రైతుల కన్ను పొడవరాదు. ఏపీలో ప్రజలు మంచినీటి కోసం తహతహలాడుతుంటే.. నాలుగు టీఎంసీలు నీరు ఇవ్వాలని బోర్డు చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. స్వార్థంతో కరెంటు ఉత్పత్తి చేసుకున్నారు. నదీ జలాలకు సంబంధించి ఎగువన ఉన్న తెలంగాణను దిగువన ఉన్న ఏపీ ఎలా అన్యాయం చేయగలదు? మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ కడుతుంటే దానిపై పోరాడి లాఠీ దెబ్బలు తిన్నాం. కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే పోరాటాలు చేశాం. ఇప్పుడు అదే మహారాష్ట్ర.. కర్ణాటకలు తెలంగాణకు చుట్టాలయ్యాయా? మేం విలన్లు అయ్యామా? ఎవరేంటి అన్నది భవిష్యత్ తరాలే నిర్ణయిస్తాయి’’ అని చెప్పుకొచ్చారు. దేవినేని మాటల్లో లాజిక్ ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. మరి.. ఈ భావనకు హరీశ్ ఎలాంటి కౌంటర్ వేస్తారో చూడాలి.