Begin typing your search above and press return to search.

2019లో పులివెందుల తమదే అంటున్నారు

By:  Tupaki Desk   |   12 July 2015 11:20 PM GMT
2019లో పులివెందుల తమదే అంటున్నారు
X
ఏపీలోని ఏ నియోజకవర్గానికి లేని ప్రత్యేకత పులివెందుల సొంతం. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా ఉండే ఈ నియోజకవర్గం ఆ కుటుంబం వారినే ఆదరిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకు వస్తే.. ఎంత టీడీపీ గాలి వీచినా.. కడప జిల్లాలో మాత్రం వీయని పరిస్థితి. ఇందుకు 2014 ఎన్నికలే నిదర్శనం.

అలాంటి జిల్లాలో.. అందునా వైఎస్ జగన్ కుటుంబం ప్రాతినిధ్యం వహించే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు గ్యారెంటీ అని.. ఆ మేజిక్ ను 2019లో చూస్తారని చెబుతున్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. ఒక ప్రైవేటు ఛానల్ లో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాటిని చూస్తే..

- ‘‘పులివెందులలో చీనీ చెట్లు ఎండిపోతుంటే.. అక్కడి రైతుల్ని ఆదుకునేందుకు ప్రత్యేకంగా 2 టీఎంసీల నీటిని విడుదల చేశాం. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన మాకు అక్కడి ప్రజలు నీరాజనాలు పలికారు. నీళ్లు ఇస్తే రైతులు ఎంత సంతోషిస్తారో నాకు ప్రత్యక్షంగా అర్థమైంది. పులివెందులలో 2019 ఎన్నికల్లో గెలిచి తీరుతాం. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడతాం’’

- ‘‘పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ఆరోపణలు నిరాధారం. ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఇంజనీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం పూర్తి అయ్యే లోపు రాయలసీమకు నీటి ఇబ్బందులు లేకుండా చేయటానికే పట్టిసీమను మొదలుపెట్టాం. ఏడాదిలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఓపెన్ ఆఫర్ ఇచ్చాం. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వమని చెప్పాం. చివరకు ఎల్ 1గా వచ్చిన కాంట్రాక్టర్ కి ఇచ్చాం. ఇందులో ఎలాంటి అవినీతి లేదు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తాం’’

- ‘‘ఎన్నికల సమయంలోనే ప్రజలకు మాటిచ్చా. ఏపీ నుంచి పాలన చేస్తానని చెప్పా. అందుకే.. నేను నిర్వహిస్తున్న నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని విజయవాడకు తరలించా. అక్కడి నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. వాస్తవానికి..చంద్రబాబు పిలిస్తే కానీ నేను హైదరాబాద్ రాను. నాకు హైదరాబాద్ లో సెంటు భూమి కూడా లేదు. నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండాలన్నదే నా కోరిక. ఈ రోజుకు కూడా గొల్లపూడిలోనూ నాకు సొంతిల్లు లేదు’’

- ‘‘సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో విజయవాడ గొడవలు.. రాజకీయాల గురించి చూశా.మురళీ.. రమణ ఇద్దరూ నన్ను రాజకీయాలకు దూరంగా ఉంచారు. మురళీ చనిపోయిన తర్వాత రమణ రాజకీయాల్లోకి రావటం.. ఆయన కూడా ప్రమాదంలో మరణించటంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. గతంలో మాదిరి ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో గొడవల్లేవు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు.

- ‘‘దేవినేని నెహ్రూ పట్ల మెతకగా వ్యవహరిస్తున్నారన్న దాన్లో నిజం లేదు. కుటుంబంలో పెద్దగా ఆయన అంటే గౌరవం ఉంది. ఎవరి రాజకీయాలు వారివి. ఎవరి పార్టీ సిద్ధాంతాలు వారివి. ఎప్పుడైనా కుటుంబ వేడులకల్లో ఆయన్ను కలుసుకుంటూ ఉంటా’’

- ‘‘ఈ రోజుల్లో ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు చంద్రబాబు కొడుకు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కష్టపడి పని చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాలు పెంచారు. అమెరికాలో చదువుకొని వచ్చారు. అటువంటి వ్యక్తికి బాధ్యతలిస్తే తప్పు లేదు కదా? మంచి సహనం.. ఓపిక ఉంది. చెప్పింది వింటున్నాడు’’