Begin typing your search above and press return to search.

దేవినేని మాట‌కు కేసీఆర్ రియాక్ష‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   29 Jun 2018 5:09 AM GMT
దేవినేని మాట‌కు కేసీఆర్ రియాక్ష‌న్ ఇదే!
X
తెలంగాణ ఏర్ప‌డితే దుర్గ‌మ్మ‌కు మొక్కు తీర్చుకుంటాన‌న్న కేసీఆర్‌.. మొక్కు తీర్చుకోవ‌టంలో భాగంగా గురువారం బెజ‌వాడ‌కు రావ‌టం తెలిసిందే.ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి దుర్గ‌మ్మ గుడి వ‌ర‌కూ కేసీఆర్ కు స్వాగ‌తం ప‌లుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీల్ని.. బ్యాన‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఇవ‌న్నీ టీఆర్ ఎస్ నేత బండి ర‌మేశ్ పేరుతో ఏర్పాటు అయ్యాయి.

ఇదిలా ఉంటే.. ఎయిర్ పోర్ట్‌కు వ‌చ్చి కేసీఆర్‌ కు స్వాగ‌తం ప‌లికిన ఏపీ మంత్రి దేవినేని ఉమ‌ను త‌న కారులోనే తీసుకెళ్లారు కేసీఆర్‌. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ చోటు చేసుకుంది. గ‌తంలో తాను బెజ‌వాడ‌కు వ‌చ్చిన దానితో పోలిస్తే.. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింద‌ని.. ప‌చ్చ‌ద‌నం భారీగా పెరిగిన‌ట్లు కేసీఆర్ చెప్పార‌ని దేవినేని ఉమ వెల్ల‌డించారు.

బంద‌ర్ రోడ్‌ను బాగా విస్త‌రించిన వైనాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించారు. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మిన‌ల్ బాగుంద‌న్న కేసీఆర్‌తో దేవినేని ఉమ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. రాష్ట్ర విభ‌జ‌న కోసం మీరు ఆమ‌ర‌ణ‌దీక్ష చేస్తే.. స‌మైక్యాంధ్ర కోసం తాను ఆమ‌ర‌ణ‌దీక్ష చేశాన‌ని చెప్పారు. మీరు ముఖ్య‌మంత్రి అయ్యారు.. నేనేమో మంత్రిని అయ్యాన‌ని వ్యాఖ్యానించిన దేవినేని మాట‌ల‌కు కేసీఆర్ బ‌దులిస్తూ.. అదే ప్ర‌జాస్వామ్య గొప్ప‌త‌న‌మ‌ని వ్యాఖ్యానించారు.

త‌న ఏపీ ప‌ర్య‌ట‌న‌లో మీడియాతో అస‌లు మాట్లాడ‌ని కేసీఆర్‌.. సైగ‌ల ద్వారా మాత్రం త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ద‌ర్శ‌నం ఎలా జ‌రిగిందంటూ ప్ర‌శ్నించిన మీడియా ప్ర‌తినిధుల‌కు ఆనందంతో చేతిని పైకి లేపి బాగా జ‌రిగిందంటూ సైగ‌ల‌తో స‌మాధానం ఇచ్చారు. త‌న ప్ర‌యాణానికి ఏర్పాట్లు బాగా చేశార‌ని దేవినేని ఉమ‌కు చెప్పిన కేసీఆర్‌.. తానే స్వ‌యంగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసి మాట్లాడ‌తాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.