Begin typing your search above and press return to search.

ప్రతిసారీ దబాయించి నోరు మూయించడమేనా

By:  Tupaki Desk   |   12 Sep 2015 4:25 AM GMT
ప్రతిసారీ దబాయించి నోరు మూయించడమేనా
X
ఎవరైనా తమ పనితీరును ప్రశ్నిస్తే చాలు.. దబాయించి ఎదుటివారు నోరు మూయించడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటుగా మారిపోయింది. సభలో గాని వెలుపల గానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కు చెందిన ఎవరైనా తమ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే.. అసలు ప్రశ్నకు సంబంధం లేకుండా.. జగన్‌ అవినీతిని, కేసులను, కోర్టు చుట్టూ తిరుగుతుంటాడనే విషయాన్ని తెరమీదికి తెస్తూ మాట్లాడడం వారికి అలవాటే. అయితే ఇప్పుడు పట్టిసీమలో అవినీతి గురించి.. ఒకప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవిల్లి అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతోంటే.. అదే తరహాలో నోరేసుకుని పడిపోతున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు.

అయితే ప్రతిసారీ నోరేసుకుని పడిపోతూ, దబాయించి కాలం నెట్టేయాలంటే కుదరదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్‌ నంటే కేసుల ప్రస్తావనతో ఆడుకుంటారు గానీ.. ఉండవిల్లికి కూడా స్ట్రెయిట్‌ గా సమాధానం చెప్పకుంటే.. ప్రజలే పునరాలోచన చేస్తారని అంటున్నారు.

ఉండవిల్లి- పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి... కొన్ని అంశాలు తద్వారా అనుమానాలు లేవనెత్తారు. ప్రాజెక్టు అంచనా వ్యయంలోనే 200 కోట్లు ఎక్కువ వేశారని, ఈ విషయంలో తాము అన్ని పనులకు నిపుణులతోలెక్కలు వేయించి ప్రభుత్వానికి నివేదిక పంపితే పట్టించుకోలేదన్నారు. పనులు పూర్తికాకుండానే జాతికి అంకితం చేయడాన్ని ఎద్దేవాచేశారు. అయితే దీనికి ప్రతిస్పందించిన ఉమామహేశ్వరరావు.. కీలక ప్రశ్నలకు జవాబివ్వకుండా.. అనంతపురం జిల్లా రైతులు వచ్చి చాక్లెట్లు పంచి ఆనందబాష్పలు కారుస్తున్నారంటూ నాటకీయ డైలాగులు చెబుతున్నారు.

జగన్‌ మీద కేసుల రూపంలో విరుచుకుపడినట్లుగా.. ఉండవిల్లి నోరు మూయించడానికి వారికి ఆయన అవినీతి ఏమీ దొరికినట్లు లేదు. అందుకని అసలు పాయింటుకు జవాబివ్వకుండా.. చిరునామా గల్లంతైన పార్టీకి చెందిన వారు విమర్శలు చేస్తున్నారంటూ ఆడిపోసుకుంటున్నారు. ఆయన పార్టీ చిరునామా గల్లంతై ఉండవచ్చు. కానీ ఆలోచన పరులైన ప్రజల సెక్షన్‌ లో, ఉండవిల్లి మాటకు, విశ్లేషణకు ఒక విలువ ఉంది. క్రెడిబిలిటీ ఉంది. అందుకని... ఉండవిల్లి ప్రశ్నలకు ప్రభుత్వం సూటిగా సరైన జవాబులు ఇవ్వకపోతే గనుక.. ప్రజలే వారి గురించి పునరాలోచన చేసే ప్రమాదం వస్తుంది.