Begin typing your search above and press return to search.

దేవినేనికి హరీశ్ ఫోన్ చేసే ఛాన్స్ లేనట్లేనా?

By:  Tupaki Desk   |   20 May 2016 3:28 PM GMT
దేవినేనికి హరీశ్ ఫోన్ చేసే ఛాన్స్ లేనట్లేనా?
X
ఎవరితో ఎలా వ్యవహరించాలో.. తమ ప్రయోజనాల్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అలాంటివి చాలా మామూలు అంశాలు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయనలోని చతురత ఏంటో తెలిసిన తెలుగు ప్రజలకు.. ప్రత్యేకంగా ఆయనలోని కోణాల్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనట్లే.

తెలంగాణ కోసం తాను ఎంతకైనా సిద్ధమనేనన్నట్లు వ్యవహరించే హరీశ్.. కీలకమైన ఇరిగేషన్ శాఖను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ.. కర్ణాటక.. మహరాష్ట్రలతో ఉన్న పంచాయితీల్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆయన వేస్తున్న ఎత్తుగడల్ని చూసినప్పుడు ముచ్చటేయకమానదు.

ఆర్డీఎస్ (రాజోలిబండ మళ్లింపు పథకం) ప్రాజెక్టు విషయంలో కర్ణాటకతో ఏపీకి ఉన్న పంచాయితీ తెలిసిందే. ఈ పనులు పూర్తి అయిన పక్షంలో ఏపీకి ఇబ్బందన్న ఉద్దేశంతో పనుల్ని అడ్డుకునేందుకు రాయలసీమ నేతలు తీవ్రంగా ప్రయత్నించటం.. ఈ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకోవటం తెలిసిందే. ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన పూడికతీత.. ఆనకట్ట ఆధునికీకరణ పనుల్ని అపాలని లేదంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందంటూ కర్నూలు జిల్లా కలెక్టర్ లేఖ రాసిన నేపథ్యంలో.. ఏపీ మంత్రి దేవినేని ఉమకు ఈ ఇష్యూ మీద హరీశ్ పలుమార్లు ఫోన్లు చేయటం తెలిసిందే. ఏపీ ప్రయోజనాలకు దెబ్బగా మారే ఈ అంశంపై దేవినేని రియాక్ట్ కాకపోవటంతో విసుగు చెంది.. ఏపీకి తమ సహకారం అందించే విషయంలో ఇబ్బందులు తప్పవంటూ హరీశ్ ఒక దశలో హెచ్చరించిన పరిస్థితి. అయినప్పటికీ దేవినేని రియాక్ట్ కాకపోవటంతో తన వ్యూహాన్ని మార్చారు హరీశ్.

ఇప్పటికే పలుమార్లు దేవినేనికి ఫోన్ చేసిన హరీశ్.. ఈసారి కర్ణాటక మంత్రికి ఫోన్ చేశారు. కర్నూలు కలెక్టర్ అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టు పనుల్ని త్వరగా పూర్తి చేయాలంటూ కోరారు. వారం క్రితం ఆనకట్ట ఆధునికీకరణ పనులను కర్ణాటక సర్కారు చేపట్టగా కలెక్టర్ ఆదేశాలతో పనుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీతో మాట్లాడి పని పూర్తి చేసుకోవాలన్న ఆలోచన చేసిన హరీశ్ ఎత్తు పారకుండా దేవినేని వ్యవహరించటంతో ఆయన రూటు మార్చి.. ఏకంగా కర్ణాటక మంత్రికే ఫోన్ చేయటం గమనార్హం. మరి.. హరీశ్ ఫోన్ కు ఎలా స్పందిస్తారో చూడాలి.