Begin typing your search above and press return to search.

ఐదు గ్రామాల మీద కేసీఆర్ మాట అబద్ధమట

By:  Tupaki Desk   |   16 April 2016 6:12 AM GMT
ఐదు గ్రామాల మీద కేసీఆర్ మాట అబద్ధమట
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చేస్తున్న ఒక వ్యాఖ్యపై తొలిసారి ఖండన ఒకటి బయటకు వచ్చింది. పోలవరం ముంపు ప్రాంతానికి సంబంధించి తెలంగాణలోని ఏడు మండలాల్ని ఏపీలోకి కలపటం తెలిసిందే. అయితే.. ఇందులోని ఐదు గ్రామాల్ని తెలంగాణకు తిరిగి ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు భద్రచాలంలో కేసీఆర్ ప్రకటించటం తెలిసిందే. దీనిపై సీమాంధ్ర ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తమ ప్రాంతానికి చెందిన గ్రామాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్షంగా ఎలా మాట్లాడతారన్న విమర్శ వినిపించింది.

ఐదు గ్రామాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రితో తాను మాట్లాడినట్లుగా గతంలో రెండు..మూడు సార్లు చెప్పిన కేసీఆర్.. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా.. ఏపీలోని ఐదు గ్రామాల్ని తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే చెప్పేసినట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఒక రాష్ట్రానికి చెందిన గ్రామాల్ని పక్క రాష్ట్రానికి ఇచ్చేయటం నిజమే అయితే.. ఆ విషయాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించాలే కాదు.. ఒకరే పలుమార్లు ప్రకటించటం ఏ మాత్రం సరికాదు. కానీ.. ఇలాంటివేమీ కేసీఆర్ పట్టించుకోకుండా వ్యాఖ్యలు చేసేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఐదు గ్రామాల మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. పోలవరం ముంపు మండలాల్లోని ఐదు గ్రామాల్ని తెలంగాణకు తిరిగి ఇచ్చే విషయంపై కేసీఆర్ చెబుతున్న మాటలు అబద్ధాలుగా ఆయన చెప్పారు. ఒక టీవీ ఛానల్ లో మాట్లాడిన దేవినేని.. కేసీఆర్ మాటల్లో నిజం లేదని కొట్టిపారేశారు. చట్టప్రకారం ఏపీలో కలిసిన ఏ ఒక్క గ్రామాన్ని తెలంగాణకు ఇచ్చేది లేదని దేవినేని తేల్చి చెప్పటం విశేషం. అంతేకాదు.. ఏపీలో కలిపిన మండలాలన్నీ ఉంటే తప్ప పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం.. పునరావాసం కల్పించటం సాధ్యమవుతుందన్న విషయాన్ని దేవినేని చెప్పటం గమనించాల్సిన అంశంగా చెప్పాలి. దేవినేని వ్యాఖ్యపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.