Begin typing your search above and press return to search.

దేవినేని ఉమ విచారణ.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   29 April 2021 2:30 PM GMT
దేవినేని ఉమ విచారణ.. ఏం జరుగుతోంది?
X
సీఎం జ‌గ‌న్ వీడియో మార్ఫింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియ‌ర్ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. మంగ‌ళ‌గిరిలోని సీఐడీ కార్యాల‌యంలో ఇవాళ (గురువారం) ఉద‌యం 11 గంట‌ల నుంచి అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. నిజానికి లోప‌ల ఏం జ‌రుగుతోందో బ‌య‌ట ఎవ్వ‌రికీ తెలిసే అవ‌కాశం లేదు. కానీ.. దేవినేని ఉమ‌ను ఇబ్బంది పెడుతున్నారనే ప్ర‌చారం కొన‌సాగుతోంది.

దేవినేని ఉమ త‌ర‌పు లాయ‌ర్ ను కూడా లోనికి వెళ్ల‌నివ్వ‌కుండా విచార‌ణ చేస్తున్నార‌ని, క‌నీసం ఉమ‌కు భోజ‌నం కూడా పెట్ట‌కుండా ఇబ్బంది పెడుతున్నార‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు. వీటితోపాటు ఇంకా ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం సాగిస్తున్నారు.

అయితే.. ఇదంతా నిజ‌మా? లేక టీడీపీ నేతలు చేస్తున్న ప్ర‌చార‌మా? అనేది అర్థం కాకుండా ఉంది. దేవినేని ఉమ ఒక మాజీ మంత్రి. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. అలాంటి వ్య‌క్తికి క‌నీసం భోజ‌నం కూడా పెట్ట‌కుండా విచారిస్తార‌నే ఆరోప‌ణ‌ స‌త్య‌దూరం అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.

పైగా.. ఆయ‌న‌ను అరెస్టు కూడా చేయ‌లేదు. హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం సీఐడీ హెడ్ క్వార్డ‌ర్ లో విచార‌ణ‌కు పిలిచారు. ఈ సంద‌ర్భంగా ఒక సీనియ‌ర్ నేత‌పై అధికారులు ఇలా వ్య‌వ‌హ‌రిస్తారంటే న‌మ్మ‌డం కూడా క‌ష్ట‌మే. టీడీపీ నేత‌ల‌పై వైసీపీ క‌క్ష‌గ‌ట్టిందంటూ ఆ పార్టీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. అందులోని కొంద‌రు చేస్తున్న దుష్ప్ర‌చార‌మే త‌ప్ప‌, ఇందులో వాస్త‌వం లేదు అంటున్నారు వైసీపీ నేత‌లు.

ఇదిలాఉంటే.. జ‌గ‌న్ వీడియో మార్ఫింగ్ పై సీఐడీ అధికారులు ప్ర‌శ్నించినట్టుగా తెలుస్తోంది. దేవినేని ఉమ ఇచ్చిన స‌మాధానాలతో అధికారులు సంతృప్తి చెంద‌క‌పోతే.. శుక్ర‌వారం కూడా విచార‌ణ‌కు పిలిచే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.