Begin typing your search above and press return to search.

చర్చలంటున్న హరీశ్..షరతులు పెట్టిన దేవినేని

By:  Tupaki Desk   |   17 Jan 2018 7:02 PM GMT
చర్చలంటున్న హరీశ్..షరతులు పెట్టిన దేవినేని
X
తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రాష్ర్టాల పరిధిలోని రైతుల శ్రేయస్సు దృష్ట్యా రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఆధునీకరణ పనులకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కోరారు. ఈ మేరకు దేవినేని ఉమకు లేఖ రాశారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు లేఖకు స్పందించిన మంత్రి దేవినేని ఉమ ఇందుకు ప‌లు ష‌ర‌తులు విధించారు!

ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ - హెడ్‌ వర్క్స్ పనులకు సంబంధించి ప‌నుల‌ విషయంలో అస్పష్టత కారణంగా...కర్ణాటక జలవనరులశాఖ మంత్రి పాటిల్‌తో మంత్రి హరీశ్‌ రావు ఇటీవల చర్చించారు. ఈనెల 4న కర్ణాటక జలవనరులశాఖ మంత్రి పాటిల్ తెలంగాణకు వచ్చిన దరిమిలా ఆర్డీఎస్ ఆధునీకరణ పనులపై ఆయనతో భేటీ కాగా...ఈ ఏడాది జూలై నాటికి పను లు పూర్తయ్యేలా కృషి చేస్తానని పాటిల్ హామీ ఇచ్చారు. అందుకు ఏపీ ప్రభుత్వ సహకారం కావాల్సి ఉందని పాటిల్ అభిప్రాయపడ్డారు. అపరిష్కృత అంశాల్ని పరిష్కరించుకునేందుకు తెలంగాణ-ఏపీ-కర్ణాటకతో త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తద్వారా ఈ ఏడాది జూలై నాటికి పనులు పూర్తవుతాయని పాటిల్ సూచించారు. ఈ నేప‌థ్యంలో మూడు రాష్ర్టాల‌తో త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటుకు ఏపీ మంత్రితో మాట్లాడుతానని మంత్రి హ‌రీశ్ రావు చెప్పారు.

అందుకు అనుగుణంగా మంత్రి దేవినేని ఉమాకు లేఖ రాశారు. `ఆర్డీఎస్ ఆధునీకరణ పనుల్లో భాగంగా చేపడుతున్న ప్యాకేజీ-1 పనులకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడేందుకు సమావేశ తేదీని సూచించాల్సిందిగా గత ఆగస్టులోనే లేఖ రాశాను. అంశాల పరిష్కారానికి చీఫ్ ఇంజినీర్ల స్థాయిలోనూ అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవి ఫలితాలను ఇవ్వలేదు. పనుల పురోగతి వివరాలను కూడా లేఖ వెంట జతపరుస్తున్నాను. ఈ నేపథ్యంలో పెండింగ్ అంశాలపై చర్చించి.. పరిష్కరించుకునేందుకుగాను కర్ణాటకతో కలిసి హైదరాబాద్‌ లో త్రైపాక్షిక సమావేశ నిర్వహణకు రెండు తేదీలను సూచించాల్సిందిగా కోరుతున్నాను` అని మంత్రి హరీశ్‌ రావు తన లేఖలో పేర్కొన్నారు.

హ‌రీశ్ రావు లేఖ రాసిన మ‌రుస‌టి రోజే ఏపీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. చ‌ర్చ‌ల విష‌యంలో త‌న స్పంద‌న తెలుపుతూ మంత్రి హ‌రీశ్‌ రావుకి దేవినేని ఉమ లేఖ రాశారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అంటూ లేఖలో దేవినేని ఉమ పేర్కొన్నారు. మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి ముందే ఇరిగేషన్ ఇంజనీర్లు.. అధికారుల స్థాయిలో సమావేశం జరపాలని హరీశ్‌ రావుకు ఉమ సూచించారు.