Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఆంధ్రోళ్ల ప‌రిస్థితి అలా ఉంద‌ట కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   14 Feb 2019 8:27 AM GMT
తెలంగాణ‌లో ఆంధ్రోళ్ల ప‌రిస్థితి అలా ఉంద‌ట కేసీఆర్‌?
X
రాష్ట్రం వ‌చ్చేసింది. ఇంక ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం ఏమిటి? తెలంగాణ‌లో ఉన్నోల్లు ఈ గ‌డ్డ‌కు చెందినోళ్లే. అంద‌రిని అక్కున చేర్చుకుంటాం. క‌డుపులో దాచుకుంటాం. వారి కాలికి ముల్లు తాకితే నా నోటితో తీస్తాన‌న్న మాట‌లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ వ్యాఖ్యానించ‌టం తెలిసిందే.

ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ప్ర‌చారంలోనూ.. తెలంగాణ‌లో ఉండే అన్ని ప్రాంతాల వారిని స‌మానంగా చూస్తాన‌ని చెబుతూ హామీల మీద హామీలు ఇచ్చే కేసీఆర్ తాజాగా జ‌రిగిన ఒక ప‌రిణామం గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అదే స‌మ‌యంలో ఆంధ్రోళ్లు కూడా త‌మ అవ‌గాహ‌న పెంచుకోవాల్సి ఉంది. ఏపీకి కేసీఆర్ వ‌స్తుంటే ఫ్లెక్సీలు.. పాలాభిషేకాలు చేసేటోళ్లు మాత్ర‌మే కాదు.. త్వ‌ర‌లోనే అమ‌రావ‌తికి వ‌స్తాన‌ని అప్పుడ‌ప్పుడు ఆంధ్రా మీద రిట‌ర్న్ గిఫ్ట్ ప్రేమ‌తో మాట‌లు చెప్పే కేసీఆర్‌.. తాజాగా జ‌రిగిన వాద‌న‌ల గురించి అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో మాదిరే విద్యుత్తు సంస్థ‌ల ఉద్యోగుల మ‌ధ్య పంచాయితీ నెల‌కొంది. స్థానిక‌త ఆధారంగానే ఉద్యోగాలు ఉండాల‌ని తెలంగాణ ఇంధ‌న సంస్థ‌లు వాదిస్తుంటే.. అర్హ‌త ఆధారంగానే ఉద్యోగాల భ‌ర్తీ ఉండాల‌ని ఏపీ వాదిస్తోంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో రిలీవ్ చేసిన (రిలీవ్ చేయ‌టం త‌ప్పు అని ఉద్యోగులు వాదిస్తున్నార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు) 1153 మంది ఉద్యోగులు త‌మ అర్హ‌త ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాల‌ని వాదిస్తున్నారు. వీరు వినిపిస్తున్న వాద‌న‌లు వినేందుకు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌ర్మాధికారి నేతృత్వంలో ఏక‌స‌భ్య క‌మిటీ తాజాగా ఇంజ‌నీరింగ్ అధికారుల అభిప్రాయాల్ని సేక‌రించింది.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ జెన్ కో సీఎండీ దేవుల‌ప‌ల్లి ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో సెంటిమెంట్ ఎక్కువ‌గా ఉంద‌ని.. ఆంధ్రా ప్రాంతం వారు తెలంగాణ‌ను ఎంపిక చేసుకోవ‌ద్ద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. అంద‌రూ హైద‌రాబాద్ ను చూసి అక్క‌డ‌కు వ‌చ్చేద్దామ‌ని అనుకుంటున్నార‌ని.. కానీ ఉద్యోగులంద‌రిని హైద‌రాబాద్‌ లోనే పోస్టింగ్ ఇవ్వాల‌న్న రూల్ లేద‌న్నారు.

తెలంగాణ జిల్లాల‌కు పంపొచ్చు.. తెలంగాణ జిల్లాల్లో సెంటిమెంట్ ఎక్కువ‌గా ఉంద‌ని.. అక్క‌డ ఉద్యోగం చేయ‌టం ఆంధ్రా ప్రాంతం వారికి క‌ష్ట‌మే.. స్థానిక‌త ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలి.. ఆంధ్రా ప్రాంతం వారు తెలంగాణ అప్ష‌న్ కోరుకోవ‌ద్ద‌ని చెప్ప‌టం దేనికి నిద‌ర్శ‌నం.

కేసీఆర్ చెప్పిన సూత్రం ప్ర‌కారం తెలంగాణ‌లో ఉన్న వారు తెలంగాణ‌వారే. వారు ఏ గ‌డ్డ‌కు చెందినోళ్లు అయినా స‌రే.. కొన్నేళ్లుగా ఉంటున్న‌ప్పుడు వారికి తెలంగాణ‌నే సొంత ప్రాంతంగా మారుతుంది. అలా ఓ వైపు కేసీఆర్ మాట‌లు చెబుతుంటే.. మ‌రోవైపు అందుకు భిన్నంగా ప్ర‌భాక‌ర్ రావు లాంటోళ్లు తెలంగాణ జిల్లాలో సెంటిమెంట్ ఎక్కువ‌గా ఉంది కాబ‌ట్టి ఆంధ్రాకు వెళ్లిపోవాల‌ని చెప్ప‌టంలో అర్థ‌మేమిటి?

ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగాల విష‌యంలో చెబుతున్న‌ది.. రేపొద్దున ప్రైవేటు ఉద్యోగాల్లో.. కొన్నాళ్ల త‌ర్వాత ఆస్తుల విష‌యంలోనూ ఇలాంటి వాద‌నే వినిపిస్తే దానికేం చెప్పాలి. రెండు ప్రాంతాల మ‌ధ్య విభ‌జ‌న అన్న‌ది వారి ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లు అనుకుందాం. కానీ.. ఆ పేరుతో ఈ త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఆంధ్రా మూలాలు ఉన్న ఉద్యోగుల్ని మేం ఎందుకు భ‌రించాల‌ని తెలంగాణ ప్రాంతీయులు అనుకోవ‌చ్చు. అదే నిజ‌మైతే.. విభ‌జ‌న కార‌ణంగా రాజ‌ధాని కోల్పోయిన ఆంధ్రోళ్ల‌కు హైద‌రాబాద్ లాంటి న‌గ‌రాన్ని ఏర్పాటు చేసుకోవ‌టానికి త‌క్కువ‌లో త‌క్కువ 150 ఏళ్లు ఖాయం. మ‌రి.. మాకు 150 ఏళ్ల కాలాన్ని మిస్ చేసినందుకు మీరేం ఇచ్చారంటే స‌మాధానం ఏమీ ఉండ‌దు.

అదే తీరులో కొన్ని విష‌యాల్ని మ‌రీ ప‌ట్టి.. ప‌ట్టి లాగ‌కుండా వీలైనంత సౌమ్యంగా ప‌రిష్క‌రించుకోవాలి. తెలంగాణ సాధ‌న‌తో భారీ లాభాన్ని పొందిన తెలంగాణ వాసులు.. ఎలాంటి చిరాకును భ‌రించ‌మంటే.. అన్ని కోల్పోయిన ఆంధ్రోళ్ల ప‌రిస్థితి ఏమిటి? బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఏపీకి వెళ‌తాన‌ని కేసీఆర్ అంటే.. సంబ‌రంగా చ‌ప్పుట్లు కొడుతున్న తెలంగాణ వారు.. ఆంధ్రాకు వెళ్లి మ‌రీ బాబును త‌మ కేసీఆర్ దెబ్బేయాల‌ని భావిస్తున్న‌ప్పుడు.. అందుకుఆంధ్రోళ్లు అండ‌గా నిల‌వాల‌ని భావించిన‌ప్పుడు.. అదే ఆంధ్రోళ్లు తెలంగాణ‌లో ఉద్యోగం చేసుకోవ‌టానికి మాత్రం ఒప్పుకోరా? అదేం న్యాయం?