Begin typing your search above and press return to search.

తెలుగు ఎయిర్ లైన్స్ కు ఇంకో దెబ్బ‌

By:  Tupaki Desk   |   24 March 2017 10:50 AM GMT
తెలుగు ఎయిర్ లైన్స్ కు ఇంకో దెబ్బ‌
X
ప్రాంతీయ విమానయాన సేవల సంస్థ ఎయిర్‌ కోస్టాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విమాన సేవ‌లు అందించ‌కుండా పార్కింగుకే ప‌రిమితం అయిన కంపెనీకి చెందిన రెండు విమాన సర్వీసుల రిజిస్ట్రేషన్‌ ను రద్దుచేస్తున్నట్లు విమానయాన నియంత్రణ మండలి (డీజీసీఏ) ప్రకటించింది. సివిల్ ఎయిర్‌ క్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ పరిధి నుంచి కంపెనీకి చెందిన రెండు ఎంబ్రాయిర్ విమాన లైసెన్స్‌ లను తొలగించినట్లు డీజీసీఏ వర్గాలు వెల్లడించాయి. ఈ చ‌ర్య‌తో ఎయిర్‌ కోస్టా సేవ‌ల పున‌రుద్ద‌ర‌ణ‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి.

విజయవాడ కేంద్రస్థానంగా విమాన సేవలు అందిస్తున్న ఎయిర్‌ కోస్టా.. నగదు కొరత - ఎయిర్‌ క్రాఫ్ట్ లీజుదారుల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాల కారణంగా ఫిబ్రవరి నుంచే విమాన సర్వీసులను రద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. మే వరకు టిక్కెట్ల బుకింగ్‌ లను కూడా నిలిపివేసింది. ఈ క్ర‌మంలోనే ఎయిర్‌ కోస్టా భ‌విష్య‌త్‌ పై ప‌లు సందేహాలు వ్యక్త‌మ‌య్యాయి. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా డీజీసీఏ తీసుకున్న ఈ తాజా చర్య సంస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు కంపెనీలో పనిచేస్తున్న 450 మంది ఉద్యోగులకు ఎలాంటి వేతనాలు చెల్లించలేదు. వీరిలో 40 మంది పైలెట్లు ఉన్నారు. ఇటీవ‌లే కొంద‌రు పైలెట్లు త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా సైతం చేశారు. మ‌రోవైపు ప్ర‌స్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు ఎయిర్‌ కోస్టాకు వ్యతిరేకంగా విజయవాడలోని ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపే యోచనలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సంస్థ నెలకు రూ.4 కోట్లు వేతన రూపంలో చెల్లింపులు జరుపుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/