Begin typing your search above and press return to search.

డీజీపీ అంజనీ కుమార్ సీటుకు ఎసరు..? ఏపీకి పోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   20 Jan 2023 11:02 AM GMT
డీజీపీ అంజనీ కుమార్ సీటుకు ఎసరు..? ఏపీకి పోవాల్సిందేనా?
X
తెలంగాణ మాజీ సీఎ సోమేష్ కుమార్ తరహాలోనే డీజీపీ అంజనీ కుమార్, ఇతర ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా ఏపీకి వెళ్లకతప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ (క్యాట్) ఆదేశాల అండతో ఏపీకి కేటాయించిన అధికారులు కొందరు తెలంగాణలో.. తెలంగాణకు కేటాయించిన వారు కొందరు ఏపీలో కొనసాగుతున్నారు. వీరిలో మాజీ సీఎస్ సోమేష్ సహా దాదాపు 15 మంది అధికారులు ఉన్నారు. వారికి అనుకూలంగా క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ డీవోపీటీ 2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సోమేష్ కేసును లీడ్ కేసుగా స్వీకరించిన హైకోర్టు ఇటీవల ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనని తీర్పును ఇచ్చింది.

మిగతా అధికారుల కేసులు శుక్రవారం హైకోర్టు విచారణ జాబితాలో ఉన్నాయి. సోమేష్ కు ఇచ్చిన తీర్పే వర్తిస్తుందని హైకోర్టు ప్రకటిస్తే వీరంతా తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఉన్నతాధికారులు జాబితాలో ప్రధానంగా డీజీపీ అంజనీకుమార్ సహా రోనాల్డ్ రోస్,జీ. అనంతరాములు, ఆమ్రపాలి తదితరులు ఉన్నారు.

అందరిలోకి ప్రధానంగా చూస్తే రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్ కొనసాగుతారా? లేక ఏపీకి వెళ్లాల్సి వస్తోందా? అన్నది ప్రశ్నగా మారింది. 2014లో ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం.. ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల విభజనలో భాగంగా అంజనీ కుమార్ ను ఏపీకి కేటాయించారు. అయితే కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించిన అంజనీకుమార్ తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. గత నెలలో డీజీపీ మహేందర్ రెడ్డి డీజీపీగా పదివీ విరమణ చేయడంతో అనూహ్యంగా డీజీపీగా ఎంపికయ్యారు.

అయితే బాధ్యతలు చేపట్టి ఇంకా నెలైనా పూర్తికాకముందే కేడర్ కేటాయింపులకు సంబంధించిన తీర్పు రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన సోమేష్ కుమార్ కు ఈణెల 10న హైకోర్టు షాకిచ్చి ఏపీకి పంపింది. ఇప్పుడు ఈ నేడు వెలువడనున్న తీర్పు అంజనీకుమార్ ను కూడా ఏపీకి పంపుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి .


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.