Begin typing your search above and press return to search.

క్యాంప్ ఆఫీస్ తరలించినంత అంత ఈజీ కాదంట‌

By:  Tupaki Desk   |   20 Aug 2015 10:08 AM GMT
క్యాంప్ ఆఫీస్ తరలించినంత అంత ఈజీ కాదంట‌
X
హైద‌రాబాద్ వ‌దిలి వెళ్లేదే లేద‌ని.. తెలంగాణ‌లో అధికారం చేజిక్కించుకున్న త‌ర్వాత మాత్ర‌మే అడుగు బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్పిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. అందుకు భిన్నంగా త‌ట్టాబుట్టా స‌ర్దుకొని.. వీలైనంత త్వ‌ర‌గా బెజ‌వాడ‌కు వెళ్లేందుకు ప‌డుతున్న హ‌డావుడి తెలిసిందే. నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ ఏపీ ఉద్యోగుల క‌ష్ట‌సుఖాల గురించి వింటూ.. చూద్దాం.. చేద్దామ‌నే స్థానంలోనే.. అదేం కుద‌ర‌దు బెజ‌వాడ‌కు బ‌య‌లుదేరాలంటూ ఏపీ స‌ర్కారు ఫ‌ర్మానా జారీ చేయ‌టం తెలిసిందే.

రానున్న రెండు.. మూడు నెలల్లో హైద‌రాబాద్ లోని ఏపీ ఉద్యోగులంతా బెజ‌వాడ‌కు వ‌చ్చేయాల‌ని.. వారికి అవ‌స‌ర‌మ‌య్యే మౌలిక వ‌స‌తులు.. స‌దుపాయాల సంగ‌తి తాము చూసుకుంటామ‌ని ప్ర‌భుత్వం అభ‌యం ఇవ్వ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హైద‌రాబాద్‌ లోని ఏపీ పోలీస్ శాఖ‌ను మాత్రం వెనువెంట‌నే ఏపీకి త‌ర‌లించే ఆలోచ‌న లేద‌ని ఏపీ డీజీపీ రాముడు స్ప‌ష్టం చేశారు.

త‌మ కార్య‌క‌లాపాలు హైద‌రాబాద్ నుంచే కొన‌సాగుతాయ‌ని చెప్పిన ఆయ‌న‌.. పోలీస్ శాఖ‌ను మారిస్తే ఏం జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదన‌టం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్‌ లో ఏపీ పోలీసుల అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేసిన డీజీపీ రాముడు.. తాను మాత్రం హైద‌రాబాద్‌.. ఏపీ రెండు చోట్ల అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు వ్యాఖ్యానించారు.

ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ త‌ర‌లించినంత సులువుగా ఏపీ పోలీస్ ను హైద‌రాబాద్ నుంచి క‌దిలించ‌టం సాధ్యం కాద‌ని.. దానితో చాలానే అంశాలు ముడిప‌డి ఉన్నాయ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. చూస్తుంటే.. ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ప‌దేళ్ల పాటు కొన‌సాగే ఏకైక ఆఫీసు ఏమైనా ఉంటే.. అది ఏపీ పోలీస్ మాత్ర‌మే అవుతుందేమో.