Begin typing your search above and press return to search.

ఏపీ ప్రజలకు శుభవార్త..ఆ వాహనాలను తీసుకోవచ్చన్న డీజీపీ!

By:  Tupaki Desk   |   23 May 2020 2:30 PM GMT
ఏపీ ప్రజలకు శుభవార్త..ఆ వాహనాలను తీసుకోవచ్చన్న డీజీపీ!
X
ఆంధ్రప్రదేశ్ ‌లోని వాహనదారులకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్ విధించిన సమయంలో పలువురు వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించి రోడ్డెక్కారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం - అధికారులు అహర్నిశలు శ్రమిస్తుంటే.. కొంతమంది వాహనదారులు మాత్రం చిన్న చిన్న కారణాలను సాకుగా చూపుతూ రోడ్లపైకి ఇష్టారాజ్యంగా రావడంతో - సరైన కారణాలు లేకుండా రోడ్డు పైకి వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేసింది. వేల సంఖ్యలో వాహనాలు పోలీసులు సీజ్ చేసారు.

అయితే, లాక్‌ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లొచ్చని డిజిపి తెలిపారు. వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్‌ ను సంప్రదించాలన్నారు. యజమానులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను పీఎస్‌ లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్‌ లో కూడా సమాచారం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లాలని చెప్పారు. అయితే ఆ వాహనాలపై ఉన్న చలానాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణలో కూడా సీజ్ చేసిన వాహనాలను తిరిగి తీసుకెళ్లాలని పోలీసులు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా క్లారిటీ ఇచ్చారు.