Begin typing your search above and press return to search.

ధర్మాన ఇలాకాలో : అన్న మీద అలక... తమ్ముడితో జత

By:  Tupaki Desk   |   7 Aug 2022 5:30 PM GMT
ధర్మాన ఇలాకాలో : అన్న మీద అలక... తమ్ముడితో జత
X
రాజకీయం మా ఒంట్లోనే కాదు మా ఇంట్లో కూడా ఉంది అని చెప్పే కుటుంబాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన వారి కుటుంబం ఒకటికి ఇప్పటికి మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఈ ఫ్యామిలీ వెలుగుతోంది. ధర్మాన ప్రసాదరావు మొదట మంత్రి అయితే ఆయన గారి అన్న గారు ఆలస్యంగా రాజకీయ అరంగేట్రం చేసినా తమ్ముడి కంటే ఎక్కువ హోదాలోనే అంటే ఉప ముఖ్యమంత్రిగానే పనిచేశారు. ఇపుడు సిక్కోలు నుంచి ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా చక్రం తిప్పుతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ అంతకంతకు ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిపోతోంది. అన్న క్రిష్ణదాస్ ని వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గా చేశారు. ఆయన జిల్లా సంగతేమో కానీ ముందు తన సొంత సీటు నరసన్నపేట రాజకీయాలనే చక్కబెట్టుకోలేక చతికిలపడుతున్నారు అంటున్నరు. నరసన్నపేటలో దాసన్నకే నస పెట్టేలా సొంత పార్టీలో రెబెల్ వర్గం రెడీ అయింది. ఆ వర్గం దాసన్న మంచివారే కానీ అంటూ ఆయన చుట్టూ ఉన్న నాయకులను విమర్శిస్తోంది.

ఏదో విధంగా పరువు బజారున పడేసే విధంగా నరసన్నపేట నాయకులు ఒక వర్గంగా మారి మీడియాకు ఎక్కుతున్నారు. ఇసుక మాఫియా ఉందని, ధర్మనకు తెలిసే జరుగుతోందా లేక తెలియక చేస్తున్నారా అంటూ కూడా అ వర్గం ప్రశ్నిస్తోంది. దీంతో పడలేక దాసన్న వారితో డైరెక్ట్ ఫైట్ కి రెడీ అయ్యారట. దాంతో వారంతా అలక పూని తమ్ముడు మంత్రి అయిన ప్రసాదరావు శరణు జొచ్చారట.

దీంతో ఈ వివాదం కాస్తా అన్నదమ్ముల వార్ గా మారుతోంది. నా నియోజకవర్గంలో నన్ను విమర్శిస్తున్న వారిని నీ దగ్గరకు చేర్చి అండగా ఉండడమేంటని అన్న దాసన్న గుస్సా అయ్యారుట. అయితే తమ్ముడు, ధర్మ సూక్ష్మాలు తెలిసినవారు అయిన ప్రసాదరావు అయితే అన్నా ఇది మన మంచికే అన్నా అంటూ దాసన్నను సముదాయించాడట.

అదెలా అంటే నీ మీద గుస్సా అయిన వారు ఏ నా దగ్గరకు నేరుగా వచ్చారు. వారికి నేను అండగా లేకపోతే వారు పోయి పోయి టీడీపీతో కలిస్తే మొత్తానికి మొత్తం మన ఫ్యామిలీకే పొలిటికల్ మంట పెట్టినట్లుగా అవుతుందని చెప్పారట. అలా తమ్ముడు శ్రీక్రిష్ణుడి మాదిరిగా గీతోపదేశం చేసినా దాసన్న మాత్రం అసహనంతోనే ఉన్నారని టాక్.

ఆయనకు ఇపుడు అతి పెద్ద సమస్య నరసన్నపేట‌ నియోజకవర్గంలో అసమ్మతి, వర్గ పోరు. ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ మీదట జిల్లాలో వైసీపీని గెలిపించాలి. ఇక సర్వేలు చూస్తే బీపీని పెంచేస్తున్నాయి. దాంతో దాసన్న తెగ హైరానా పడుతున్నారుట. ఈసారికి ఇంతే సంగతులు అని ఎక్కడ హై కమాండ్ దాసన్నకు టికెట్ కి ఎసరు పెడుతుందో అన్న కంగారు కూడా ఉందిట.

అయినా ఆరున్నర పదులు దాటిన వయసు. రాజకీయాల నుంచి ఇక రిటైర్ కాక తప్పదేమో అని ఆయన ప్రత్యర్ధి వర్గం వెటకరిస్తోందిట. మొత్తానికి ధర్మాన వారి సొంత ఇలాకాలో ఈ పేచీలు, గొడవలు చూస్తే సిక్కోలులో టోటల్ గా వైసీపీ ప్రెజెంట్ పొజిషన్ ఏంటో తెలిసిపోతోంది కదా అని టీడీపీ వారు ఎకసెక్కమాడుతున్నారు.