Begin typing your search above and press return to search.

వైసీపీ సర్కార్ ఫెయిల్యూర్ ఏంటో చెప్పేసిన ధర్మాన... ?

By:  Tupaki Desk   |   17 Nov 2021 5:31 AM GMT
వైసీపీ సర్కార్ ఫెయిల్యూర్ ఏంటో చెప్పేసిన ధర్మాన... ?
X
ప్రభుత్వాలు ఘనంగా ఉంటాయి. గొప్పగా ఖర్చు పెడతాయి అని అంతా అనుకుంటారు. నిజానికి ఇది చాలా తప్పు. అందరికీ ఒక రేట్ ఉంటే సర్కారీ వారి రేట్లు చాలా చిత్రంగా ఉంటాయి. బయట మార్కెట్ కి ప్రభుత్వం ఇచ్చే రేట్లకు ఎక్కడా పొంతన ఉండదు. అందుకే సర్కారీ పనులు చేసే కాంట్రాక్టర్లు కూడా కొంత అటూ ఇటూగా చేసి వేరే దాని నుంచి ఈ నష్టాలను పూడ్చుకుంటారు. నిజంగా ప్రభుత్వం చెప్పిన రేట్లకు పనులు చేయమంటే ఈ భూమి మీద ఎవరూ అసలు చేయలేరు. ఇది అందరికీ తెలిసిన విషయం అయినా దాన్ని చాలా చక్కగా మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు, పధకాలు పడకేసిన తీరు మీద తనదైన సునిశిత విమర్శలు చేస్తూనే ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇచ్చారు.

వైసీపీ సర్కార్ గ్రాం స్థాయిలో మండల స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలతో పాటు, అనేక భవనాల నిర్మాణం చేపడుతోంది. అలాగే నరేగా పేరిట కేంద్రం రాష్ట్రం కలసి చేసే పనులు చాలా ఉన్నాయి. అయితే వీటిని చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. అదే టైమ్ లో చాలా పనులు ఆగిపోతున్నాయి కూడా. దీని వెనకాల మతలబు ఏంటి అన్నది అందరికీ తెలిసినా బయటకు మాట్లాడరు. ఇక సీఎం జగన్ సమీక్ష సమావేశాల్లో అధికారులను పిలిచి ఫలానా డెడ్ లైన్ లోగా కార్యక్రమాలు పూర్తి కావాలని చెబుతారు. పై నుంచి దిగువ స్థాయి వరకూ అధికారులు వత్తిడి పెడతారు, అది అలాగే జరిగిపోతుంది తప్ప నిజానికి అక్కడ ఒక ఇటుక కూడా కదలదు.

మరి దీనికంతటికీ కారణం ఏంటి అంటే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవివరంగా తెలియచేశారు. ఏ కాంట్రాక్టర్ అయినా పని చేస్తే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే చూస్తాడు, కానీ సర్కారీ పనులలో అది వీలు కాకపోతే మరింతగా చేతి చమురు వదులుతూంటే ఎవరు ముందుకు వస్తారు. ఒక వైపు సిమెంట్ ధర బస్తా 380 ఉంటే ప్రభుత్వం వారి స్టాండర్డ్ ఎస్టిమేషన్ రేట్లు తీసుకుంటే 200 రూపాయలు మాత్రమే ఇస్తారు, ఇక ఇసుక ట్రాక్టర్ ధర బయట అయిదు వేల రూపాయలు ఉంటే దాన్ని 2,500 కే ఇస్తారు, అలాగే టన్ను ఐరన్ బయట 70 వేలు ఉంటే యాభై వేల రూపాయలు రేట్లు కడితే ఎవరు పని చేయడానికి ముందుకు వస్తారంటూ ధర్మాన చక్కగా ధర్మ సూక్ష్యం చెప్పుకొచ్చారు.


ఇలా సగానికి సగం ధరలను తగ్గించి ఇస్తే ప్రభుత్వ పధకాలు ఎపుడు పూర్తి అయ్యేను అన్నదే మాజీ మంత్రి సూటి ప్రశ్న. అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాకు ఏ ఏటి కా ఏడు వచ్చే పనులు గడువు లోగా పూర్తి కాకపోతే జిల్లావే అన్ని విధాలుగా నష్టపోతోంది అని కూడా ఆయన అంటున్నారు. వాస్తవానికి విరుద్ధంగా బయట రేట్లకు వ్యతిరేకంగా అధికారులు కడుతున్న రేట్లతోనే కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారని ఆయన వివరిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో పధకాలు ప్రారంభించినా అవి పూర్తి కాకపోవడం వెనక అసలు కధ ఇదేనని ధర్మాన అంటున్నారు. ఈ విషయంలో ఇంజనీర్లను ఉన్నతాధికారులు అడిగినా నిలదీసినా వత్తిడి పెట్టినా సుఖం లేదని కూడా ఆయన తేల్చేశారు.

తప్పు ప్రభుత్వం దగ్గరే ఉందని కూడా గట్టిగా చెప్పేశారు. మనం స్టాండర్డ్ ఎస్టిమేషన్ రేట్లను వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా సవరించుకోవాల్సిందే అని కూడా డిమాండ్ చేశారు. లేకపోతే చెడ్డ పేరు సర్కార్ కే అని కూడా కుండ బద్ధలు కొట్టారు. ధర్మాన చెప్పారని కూదు కానీ ఆయన ఇచ్చిన వివరాలు గణాంకాలు తీసుకుంటే సగానికి సగం నష్టపోయి ఏ కాంట్రాక్టర్ పని చేసేందుకు ముందుకు వస్తాడు, అందుకే ప్రభుత్వ పధకాలు ఆగిపోతున్నాయి. ఆ విధంగా సర్కార్ కి ఫెయిల్యూర్ ముద్ర పడుతోంది. మరి దీని మీద ప్రభుత్వ సరిగ్గా ఆలోచన చేసి సవరించుకుంటే మంచిది. లేకపోతే జగన్ స్థాయిలో ఎన్ని సమీక్షలు చేసినా కూడా అడుగు ముందుకు కదలదంతే.