Begin typing your search above and press return to search.

ఓన్లీ ధర్మాన బ్రదర్స్....నాట్ అదర్స్...?

By:  Tupaki Desk   |   1 April 2022 3:30 AM GMT
ఓన్లీ ధర్మాన బ్రదర్స్....నాట్ అదర్స్...?
X
శ్రీకాకుళం జిల్లాలో బలమైన నాయకుడిగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఆయన సీనియర్ మోస్ట్ నేత. ఇక 2019 ఎన్నికల వేళ ఆయన క్యాడర్ చేసిన ప్రచారం చూస్తే మూడేళ్ళుగా ఎంతలా డిసప్పాయింట్మెంట్ అయ్యారో అరధమవుతుంది. కాబోయే మంత్రికి మీరు ఓటేస్తున్నారు అని శ్రీకాకుళంలో ఊరూరా ప్రసాదరావు అనుచరులు తిరిగారు. జనాలు కూడా ఆ విధంగానే ఆయనకు ఓటేసి గెలిపించారు. శ్రీకాకుళం జిల్లాలో చూస్తే క్రిష్ణదాస్ ని మంత్రిని చేశారు. ఆనక ఉప ముఖ్యమంత్రిని చేశారు.

ఈ నేపధ్యంలో ఆయనతో పాటు అనుచర వర్గం ఖంగు తిన్నారని ప్రచారం అయితే సాగింది. ఇక 2019 ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ధర్మాన చేత విడుదల చేయించిన జగన్ తీరా గెలిచాక ఎందుకు పక్కన పెట్టారు అంటే దానికి రాజకీయ కారణాలే ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీ సీటు విషయంలో ప్రసాదరావు సహకరించలేదు, అందువల్లనే వైసీపీ ఓటమి పాలు అయింది అన్న దాని మీదనే ఆయనకు మినిస్టర్ చాన్స్ పోయింది అంటున్నారు.

ఈ మూడేళ్ళలో చూసుకుంటే ప్రసాదరావు కొన్ని సందర్భాల్లో హాట్ హాట్ కామెంట్స్ చేశారు. సొంత ప్రభుత్వం మీద అపుడపుడు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక ఆయన వైసీపీలో ఇమడలేకపోతున్నారు అని కూడా ప్రచారం జరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే రీసెంట్ గా అసెంబ్లీలో శాసనసభకు ఉన్న హక్కులు చట్టాలు చేసే అధికారాలు అన్న దాని మీద ధర్మాన అద్భుతమైన స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు.

దీంతో ఆయనకు బెర్త్ ఖాయమని అనుకున్నారు. అయితే ఇపుడు జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే ధర్మానకు మినిస్టర్ పోస్ట్ కాదని, స్పీకర్ పదవి మాత్రమే ఇస్తారని తెలుస్తోంది. ఆయన ఈ కీలకమైన పదవిని అందుకోవడానికి అర్హుడే కానీ ఆయనకు మంత్రిగా చేయడమే ఇష్టం. చివరి రెండేళ్లలో తాను ఏంటో నిరూపించుకుంటూ పార్టీని కూడా ముందుకు తీసుకువెళ్తానని అంటున్నారు. సిక్కోలులో వచ్చే ఎన్నికలు గట్టిగా జరిగే సీన్ ఉంది. ధర్మాన ఫ్యామిలీ మొత్తం కూడా నిలబడితేనే విజయం వైసీపీకి సాధ్యపడుతుంది.

ఇక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న క్రిష్ణ దాస్ తనకు పదవి పోతే తమ్ముడు ప్రసాదరావుకు ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా మినిస్టర్ గిరీ అయిదేళ్ళూ ఆ ఫ్యామిలీకే ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. కానీ జగన్ చూపు మాత్రం తమ్మినేని సీతారామ్ మీద ఉందని అంటున్నారు. దానికి కారణం ఆయన అచ్చెన్నాయుడు అంటే ఒంటికాలి మీద లేస్తారు. వారిది రాజకీయంగా బద్ధ వైరం. దాంతో తమ్మినేనిని ముందు పెట్టి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ యుద్ధాన్ని కొనసాగించమని అంటున్నారు. మరి చూడాలి ప్రసాదరావు ఆశలు ఎంతవరకూ నెరవేరతాయో.