Begin typing your search above and press return to search.

కొత్త ఇమేజ్ అవసరమా దాసన్నా : అమాయకుడిని కాదు అసాధ్యుడిని...

By:  Tupaki Desk   |   26 Jun 2022 3:30 AM GMT
కొత్త ఇమేజ్ అవసరమా దాసన్నా  :  అమాయకుడిని కాదు అసాధ్యుడిని...
X
శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, నిన్నటి వరకూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన క్రిష్ణదాస్ తాజాగా పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చాలా మంది అమాయకుడు అని అనుకుంటున్నారని, తాను అమాయకుడిని కానే కాదని ఆయనే చెప్పుకుని పార్టీ వారికి షాక్ ఇచ్చారు. నేను అమాయకుడిని అయితే నాలుగు సార్లు నియోజకవర్గంలో ఎలా గెలుస్తాను అని ఆయన ప్రశ్నించారు.

ఇక పార్టీలో ఎవరైనా హద్దు మీరితే క్షమించే ప్రసక్తి లేదని కూడా ఆయన అన్నారు. తాను ఎవరికీ అసలు స్పేర్ చేయనని కూడా చెప్పేశారు. ఈ విషయం పక్కన పెడితే క్రిష్ణదాస్ ని అమాయకుడు అని ఎవరు అన్నారు, ఎవరు అలా భావించారు అన్న ప్రశ్న అయితే ఇపుడు ముందుకు వస్తోంది. ఆయన మంచి మనిషి అని అంతా అంటారు. అలాగే అందరిలాగా నోరు జారి మాట్లాడరని, సహనంతో ఉంటారని కూడా అంటారు.

ఒక విధంగా ఇవి మంచి లక్షణాలే. ఇప్పటి తరంలో ఈ రోజున రాజకీయ నాయకులలో అసలు లేని లక్షణాలే. మరి అవ్వ పేరే ముసలమ్మ అని ఈ రోజుల్లో మంచి వారిని కూడా అమాయకులు అంటున్నారు. బహుశా ఈ తరహా వ్యాఖ్యల వల్లనే తన మంత్రి పదవి పోయింది అన్న బాధ ఏదో ఆయనలో ఉందని భావించాలి. తాను దూకుడుగా లేననే మినిస్టర్ పోస్ట్ ని తీసేశారు అన్న వ్యధ ఆయనకు ఉండి ఉండాలి.

సరే మంత్రి పదవి పోయింది, ఇపుడు ఎమ్మెల్యే టికెట్ కూడా డౌట్ లో పడింది అంటున్నారు. దూకుడుగా ఇక్కడ టీడీపీ ఉంది. దాసన్న మెతకగా ఉంటే ఆయనను ఓడించేస్తారు అన్న కంగారు కూడా హై కమాండ్ దృష్టిలో ఉందిట. ఇలాంటి ప్రచారం వల్ల ఎమ్మెల్యే టికెట్ కే ఎసరు వచ్చేట్లు ఉందని భావించిన దాసన్న పార్టీ వేదికల మీదకే క్లారిటీ ఇచ్చేశారు.

తాను అమాయకుడుని అసలు కానే కాదని కూడా తానే చెప్పుకున్నారు. తాను అసాధ్యుడిని సుమీ అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు. అయినా దాసన్న ఈ వయసులో ఫైర్ బ్రాండ్ లా మాటలు జారినా బాగా ఉండదేమో. ఇక ఇంతకాలం సంపాదించుకున్న హుందాతనం కూడా తగ్గిపోవడం తప్ప ఒరిగేది ఏమీలేదు. దాసన్న‌ అంటే దాసన్నే. ఆయన మంచికి మర్యాదకు మారు, ప్రత్యర్ధిని సైతం గౌరవంగా చూస్తారు, నోరు జారే రకం కాదు అన్న మంచి పేరు ముందు ఏది సరిసాటి దాసన్నా అని అభిమానులు అంటున్నారు.

నిజానికి అమాయకుడు అంటే అదేమీ తప్పు పదం కూడా కాదు కదా, మాయ చేయలేని వారు అమాయకులే కదా. ఆ విధంగా దాసన్న మంచి వారుగా అమాయకుడిగా ఉండడమే అభిమానులకు కూడా ఇష్టం. మరి అదే హై కమాండ్ కి అయినా వర్తమాన రాజకీయానికి అయినా అనర్హత అయితే హ్యాపీగా దాసన్న రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలా కాకుండా నేను మరో రకమని ఆరు పదులు దాటిన వయసులో రెండవ కోణం చూపిస్తాను అంటే కుదిరే పనేనా. జనాలు మెచ్చుతారా. ఏదైనా పెద్ద మనిషి దాసన్నకే అన్నీ తెలుసు కాబట్టి ఆయన విజ్ఞతకే వదిలేయడం బెటర్.