Begin typing your search above and press return to search.

ధ‌ర్మాన వార‌సుడి ఎంట్రీ.. సిక్కోలు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   12 Jan 2021 3:30 PM GMT
ధ‌ర్మాన వార‌సుడి ఎంట్రీ.. సిక్కోలు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్
X
శ్రీకాకుళం జిల్లా రాజ‌కీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించుకు న్నారు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో రెవెన్యూ శాఖ మంత్రిగా చ‌క్రం తిప్పారు. ఇక‌, త‌ర్వాత వైసీపీలోకి చేరినా.. ఆశించిన గుర్తింపు మాత్రం రాలేదు. ఆయ‌న‌కు ద‌క్కుతుంద‌ని భావించిన మంత్రి ప‌ద‌వి.. ఆయ‌న సోద‌రుడు కృష్ణ‌దాస్‌కు ద‌క్కింది. మేధావిగా, నిశిత ప‌రిశీల‌న చేసే నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాదరావు.. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో వ‌రుస‌గా రెండుసార్లు 2019లో ఒక‌సారి విజ‌యం సాధించారు.

కానీ, ఇప్పుడు ఆయ‌న‌కు పార్టీలోను, ప్ర‌భుత్వంలోను కూడా ఆశించిన ప‌ద‌వి ద‌క్క‌క పోవ‌డంతో ఒకింత నిరాశ‌తో ఉన్నారు.ఈ క్ర‌మంలో పార్టీ కార్య‌క్ర‌మాలు పూర్తిగా డుమ్మా కొడుతున్నారు. అయితే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు మాత్రం ప్రొటోకాల్ ప్ర‌కారం హాజ‌రవుతున్నా.. ఏదో మొక్కుబ‌డి ముగిస్తున్నారు. ఇదిలావుంటే.. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. త‌న వార‌సుడిని రంగంలోకి దింప‌డం.. జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ధ‌ర్మాన కుమారుడు రామ్ మ‌నోహ‌ర్ గ‌త ఆరు మాసాలుగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన రామ్ మ‌నోహ‌ర్‌.. పార్టీ త‌ర‌ఫున త‌న తండ్రి పాల్గొనాల్సిన కార్య‌క్ర‌మాల‌కు తూ.చ‌. త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతున్నారు.

వైసీపీ జెండాను భుజాన వేసుకుని నుదుటున నిలువెత్తు బొట్టు పెట్టుకుని మ‌రీ కార్య‌క్ర‌మాల‌కు రావ‌డం పార్టీ కేడ‌ర్‌లో ఆస‌క్తిగా మారింది. అయితే.. ఎక్క‌డా వాయిస్ మాత్రం వినిపించ‌డం లేదు. వేదిక‌ల‌పై కూర్చున్నా.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచినా.. మీడియాలో మాత్రం ప్ర‌ముఖంగా ఎలాంటి వ్యాఖ్య‌లు సంధించ‌డంలేదు. కానీ, స‌మ‌యంలో చూసుకుని మాట్లాడ‌తార‌ని అంటున్నారు ధ‌ర్మాన అనుచ‌రులు. ప్ర‌స్తుతానికి రాజ‌కీయాల‌ను ఆయ‌న సైలెంట్‌గా స్ట‌డీ చేస్తున్నార‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు కొత్త కాక‌పోయినా.. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు ఇంకా ఫ్యూచ‌ర్ ఉండ‌గానే వార‌సుడిని రంగంలోకి దింప‌డం, తాను పాల్గొనాల్సిన పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కుమారుడికి అప్ప‌గించ‌డం ఆస‌క్తిగా మారింది. దీనిని బ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌ప్పుకొని వార‌సుడి అవ‌కాశం ఇస్తారా? లేక ఆల్ట‌ర్నేట్ నియోజ‌క‌వ‌ర్గం అన్వేషిస్తారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.