Begin typing your search above and press return to search.

రాజీనామా అంటున్న వైసీపీ మంత్రి...కోరి తెచ్చుకున్న పదవి వద్దా...?

By:  Tupaki Desk   |   21 Oct 2022 2:30 PM GMT
రాజీనామా అంటున్న వైసీపీ మంత్రి...కోరి  తెచ్చుకున్న పదవి వద్దా...?
X
ఆయన ఉత్తరాంధ్రాలోని సీనియర్ నేతలలో ఒకరు. అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలుమార్లు మంత్రిగా పనిచేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్దాయన. ఆయనే ధర్మాన ప్రసాదరావు. ఆయనకు ఆరు నెలల క్రితం జగన్ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. ఇక శాఖాపరంగా కీలకమైన రెవిన్యూ శాఖను అప్పగించారు. దాంతో ప్రసాదరావు ఆశలు నెరవేరాయని ఇక ఖుషీ అని అంతా అనుకున్నారు. కానీ మంత్రి అయి తన సొంత జిల్లాకు వచ్చి అభినందన సభలో పాల్గొన్న ప్రసాదరావు ఆ రోజే తన పొలిటికల్ రిటైర్మెంట్ గురించి చెప్పి షాక్ తినిపించారు. వర్తమాన రాజకీయాల్లో కొనసాగడం కష్టం అన్నట్లుగా పేర్కొన్నారు. పైగా ఎపుడూ మేమేనా అంటూ కూడా చెప్పుకొచ్చారు.

ఆ తరువాత కూడా ఆయన అనేక సందర్భాలలో మంత్రి పదవి దక్కిందన్న ఆనందం కంటే కూడా రెవిన్యూ శాఖలో అవినీతి అంటూ సంచలన కామెంట్స్ వంటివి చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఈ మధ్యనే రాజుకున్న మూడు రాజధానుల వ్యవహారం మీద ఆయన మాట్లాడుతూ అవసరం అయితే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాడుతాను అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

దాని మీద విపక్షాలు సైతం ఘాటుగానే రియాక్ట్ అయ్యాయి. వైసీపీ మంత్రుల రాజీనామాలు డ్రామా అని కూడా దుయ్యబెట్టాయి. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆయన రాజీనామా వ్యవహారం ఇప్పటికైతే ఏమీ తేలలేదు కానీ ఇపుడు ధర్మాన మరోసారి తన రాజీనామా అంశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి జగన్ వద్దనే కదిపారు అని అంటున్నారు.

తాజాగా ఆయన ముఖ్యమంత్రిని కలసినపుడు తాను రాజీనామా చేస్తాను అని చెప్పారట. అనుమతిస్తే మూడు రాజధానుల విషయంలో తాను ముందుండి పోరాడుతానని ధర్మాన వెల్లడించారుట. అంతా విన్న ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మంత్రితో అన్నట్లుగా సమాచారం. అదే విధంగా మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుతూ తాము మూడు రాజధానులను ప్రతిపాదించామని, రాజీనామాలు చేయడం అనవసరమని వారించారని భోగట్టా.

ఈ విషయంలో ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యం దిశగా సాగుతోంది అని కూడా అన్నారని తెలుస్తోంది. అయితే ధర్మనా కోరి మరీ తెచ్చుకున్న మంత్రి పదవి విషయంలో ఎందుకు వద్దు అనుకుంటున్నారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అదే సమయంలో ఆయన 2019 ఎన్నికల వేళనే కాబోయే మంత్రికి మీ ఓటు అని తన అనుచరులతో ఎన్నికల ప్రచారం చేయించుకుని గెలిచారు.

అంటే వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తే డ్యాం ష్యూర్ గా తనకు మంత్రి పదవి దక్కుతుందని నాడు ధర్మాన భావించారు అని అంటారు. అయితే ఆయనకు తొలి విడతలో పదవి రాకపోవడం పట్ల తీవ్ర మనస్తాపం చెందారని అంటారు. ఆ విధంగా ఆయన ఒక ఎమ్మెల్యేగా అప్పట్లో ప్రభుత్వం మీద విసుర్లు విసురుతూ కొంత సంచలనం రేకెత్తించారు. చివరికి కోరుకున్నట్లుగా మంత్రి అయ్యారు. మరి ఆయన ఈ పదవిలో ఆనందంగా ఉండలేకపోతున్నారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా ధర్మాన రాజీనామా విషయంలో ఎందుకో సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అన్నది సీఎం జగన్ తో మాట్లాడడం ద్వారా బయటపెట్టుకున్నారు. చూడాలి మరి ఆయన ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తారో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.