Begin typing your search above and press return to search.

ధర్మాన బ్రదర్స్ చేతిలో వైసీపీ జోరు చేసేనా...?

By:  Tupaki Desk   |   6 Sep 2022 3:30 AM GMT
ధర్మాన బ్రదర్స్ చేతిలో వైసీపీ జోరు చేసేనా...?
X
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కొందరికి బాధ్యతలు అప్పగించి వారికి అలా చూసుకోమని చెప్పేస్తారు. ఆ విధంగా వారి మీద గురుతర బాధ్యతలే పెడతారు. ఈ విధంగా చూసుకుంటే ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం వైసీపీ బాధ్యతలను సీనియర్ మోస్ట్ నేతలు, రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబంగా ఉన్న ధర్మాన బ్రదర్స్ చేతిలో పెట్టేశారు.

ఇందులో మూడేళ్ళ పాటు డిప్యూటీ సీఎం గా పనిచేసిన ధర్మాన క్రిష్ణదాస్ కి వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఆయన తమ్ముడు ప్రసాదరావుకు అతి ముఖ్యమైన రెవిన్యూ శాఖ ఇచ్చారు. ఇక జిల్లాలో బలంగా ఉన్న టీడీపీని, రాజకీయంగా గట్టి బలం కలిగిన కింజరాపు ఫ్యామిలీని నియంత్రించి మరీ ఫ్యాన్ ని జిల్లాలో గిర్రున తిప్పాలని జగన్ కోరుకుంటున్నారు.

అయితే ఈ బ్రదర్స్ ఇద్దరూ చేస్తున్న రాజకీయం ఫ్యాన్ స్పీడ్ పెంచేందుకు ఏ మాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. ముందుగా మంత్రిగారి గురించి చెప్పుకుంటే ప్రసాదరావు నెమ్మదిగా ఉంటారు. అలాగని తక్కువ చేయడానికి లేదు, ఆయన వ్యూహాలకు ప్రాధాన్యత ఇస్తారు. దాంతో ఆయన బయటకు వచ్చి మీడియా ముందు గంభీరంగా మాట్లాడడం, నోరు చేయడం ఎక్కువగా జరగదు. పైగా ఆయన ప్రతిపక్షాలను విమర్శించడంలో కూడా ఎపుడూ తొందరపడరు.

ఆయన టీడీపీని విమర్శించినా పాతకాలం మాదిరిగా సున్నితమైన చమత్కారాలతో మాట్లాడుతూ వస్తారు. అయితే ఇపుడున్న దూకుడు రాజకీయానికి ఇది ఏ మాత్రం డోస్ సరిపోవడం లేదని ఆ పార్టీ వారే అంటున్నారు. ఇక జిల్లా మొత్తాన్ని పార్టీని చూసుకోవాల్సిన మంత్రి గారు ఎంతసేపూ తన సొంత నియోజకవర్గంలోనే కాలక్షేపం చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయన ఉంటే అమరావతి లేకపోతే తన ప్రాంతం అన్నట్లుగా కధ నడిపేస్తున్నారు అని అంటున్నారు.

అయిదు నెలల క్రితం మంత్రి అయిన ప్రసాదరావు దూకుడు చేసే విషయంలో మాత్రం బాగా వెనకబడిపోతున్నారు అని అంటున్నారు. ప్రభుత్వం మీద విపక్షాలు చేసే విమర్శలను ఎక్కడికక్కడ చెక్ పెడుతూ పార్టీ వాయిస్ ని కానీ ప్రభుత్వం గొంతుని కానీ వినిపించడంలో ఎందుకో ఆయన తగ్గి ఉన్నారనే అంటున్నారు. ఇది తమ్ముడు సైడ్ అయితే అన్నగారు అయిన వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ క్రిష్ణదాస్ కూడా తన మార్క్ ఏదీ చూపించడంలేదు అంటున్నారు.

జిల్లాలో ఉన్న ఎనిమిది అసెంబ్లీ సీట్లలో వైసీపీకి మెజారిటీ సీట్లలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. దాంతో పాటు పలు నియోజకవర్గాల‌లలో పార్టీలో వర్గ పోరు ఉంది. మరీ ముఖ్యంగా క్రిష్ణదాస్ సొంత సీటు నరసన్నపేటలో ఆయనే స్వయాన వర్గ పోరుని ఎదుర్కొంటున్నారు అని టాక్ నడుస్తోంది. మరి వీటికి తెర దించి పార్టీని ముందుకు నడిపించే విషయంలో దాసన్న మాత్రం నిదానంగా ఉదాశీనంగానే ఉన్నారని అంటున్నారు.

ఈ నేపధ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే మొత్తం ఎనిమిదింటికీ కేవలం రెండు సీట్లలో మాత్రమే వైసీపీ గెలుస్తుంది అని వస్తున్న సర్వేలు మాత్రం పార్టీ క్యాడర్ కి దడ పుట్టిస్తున్నాయి. కీలకమైన నియోజకవర్గాలు చేయి జారుతాయని అంటున్నారు. మరి దీని మీద బ్రదర్స్ ఇద్దరూ దృష్టి పెట్టి పార్టీని పట్టాలెక్కిస్తారా అన్నదే చర్చగా ఉంది మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.