Begin typing your search above and press return to search.

లోటు నిజమా.. వృద్ధి నిజమా?

By:  Tupaki Desk   |   30 Oct 2016 6:34 AM GMT
లోటు నిజమా.. వృద్ధి నిజమా?
X
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ లీడర్ - మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో లాజిక్కులు తీసి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. విభజన అనంతరం రాష్ట్రం దాదాపు రూ.18వేల కోట్ల లోటుతో అల్లాడుతోందని.. అలా ఆర్థికంగ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో గతేడాది 10 శాతానికి పైబడి - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతానికి పైబడి వృద్ధి రేటు ఎలా నమోదు చేసిందని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూలోటు - వృద్ధిరేటు ఏక కాలంలో అసాధ్యమని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ - అభివృద్ధి పథకాల అమల్లో విపరీతమైన అవినీతి రాజ్యమేలుతోందని, అధికార పార్టీ మంత్రులు - ఎమ్మెల్యేలు - కార్యకర్తలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన టిడిపి - ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీతోనే మరింత ఉపయోగమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆర్థిక లోటును తీర్చలేని కేంద్రం ప్యాకేజీతో రాష్ట్రాన్ని ఆదుకుని, స్వర్ణాంధ్రగా మారుస్తామని పేర్కొనడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు.

ప్యాకేజీ రూపంలో కేంద్రం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వట్లేదని, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్న మాదిరిగానే నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఇక అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు కేంద్రాన్ని, కేంద్ర మంత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి మొత్తం అమరావతి కేంద్రంగా సాగితే మరోసారి ప్రాంతీయ అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలు - ఎన్నికల హామీలు - ప్రత్యేక హోదా విషయంలో ద్వంద్వ వైఖరిపై వైకాపా ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా రెవెన్యూ లోటు, వృద్ధి రేటు దూకుడు రెండూ ఒకేసారి ఉండవని.. అలా చేయగలగడానికి చంద్రబాబేమైనా మాంత్రికుడా అని వైసీపీలోని మిగతా నేతలూ ప్రశ్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/