Begin typing your search above and press return to search.

గ‌త ప్ర‌భుత్వాల పాల‌సీలు మార్చే హ‌క్కు మాకుంది.. వ‌ద్ద‌నే అధికారం లేదు.. : ధ‌ర్మాన ఫైర్‌

By:  Tupaki Desk   |   24 March 2022 3:30 PM GMT
గ‌త ప్ర‌భుత్వాల పాల‌సీలు మార్చే హ‌క్కు మాకుంది.. వ‌ద్ద‌నే అధికారం లేదు.. :  ధ‌ర్మాన ఫైర్‌
X
ఒక పార్టీ సభలో మెజార్టీతో అధికారంలో ఉందంటే.. అంతకు ముందు ఉన్న ప్రభుత్వ విధానాలను మార్చమని ప్రజలు అధికారం ఇవ్వడమే అవుతుంది కదా.. అని ధర్మాన ప్ర‌సాదరావు వ్యాఖ్యానించారు. ఆ అధికారమే లేదని న్యాయస్థానాలు చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వివిధ ప్రభుత్వాలు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను త‌ర్వాత వ‌చ్చిన‌ ప్రభుత్వాలు మార్చిన సంగతి గుర్తు చేశారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దును తర్వాతి ప్రభుత్వాలు చేయలేదా? అని ప్రశ్నించారు.

గురువారం ఏపీ అసెంబ్లీలో రాజ‌ధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో చ‌ర్చ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాన సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న్యాయవ్యవస్థలో స్వీయ నియం త్రణ ఉండాలని, కానీ, ఇతర వ్యవస్థల్లో అందునా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులు పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది. ప్ర‌భుత్వ‌ బాధ్యతల్ని కట్టడి చేసే విధంగా ఈ వ్యాఖ్య‌లు ఉన్నాయన్న అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇలాంటి సమయంలో కోర్టు వ్యాఖ్యలపై చర్చాసమీక్షలకు శాసన సభకు హక్కు ఉంటుందా? అనే విషయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పును ప్రస్తావించారు.

వ్యవస్థల పరిధి, విధులు ఏంటన్న దానిపై స్పష్టత ఉండాలి. లేకుంటే వ్యవస్థల్లో నెలకొనే అవకాశం ఉంది. సమాజం పట్ల తమకు పూర్తి బాధ్యత ఉందని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించింది. అంతేకానీ జ్యూడీషీయిల్‌ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే.. ఆ విషయాన్ని ఎన్నుకున్న ప్రజలే చూసుకుంటారు. అంతేకానీ, కోర్టులు జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. అంతేకాదు.. ఎంత నిగ్రహంగా కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీం కోర్టు వివరించిందన్నారు.

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గం.. వేటికవే వ్యవహరించాలి. ఈ వ్యవస్థలన్నీ ప్రజల కోసమే ఉన్నాయి. న్యాయవ్యవస్థ, కోర్టులంటే గౌరవం ఉంది. విధి నిర్వహణలో ఒకదానిని మరొకటి పల్చన చేస్తే.. పరువు తీసుకోవడం తప్పించి ఏం ఉండదని చెప్పారాయన. అందుకే ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దని, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చుకుండా అడ్డుపడొద్దని ధర్మాన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు, ఇతర న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు కాపీలను చదివి వినిపించారు.

న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాలని బాధ్యత కోర్టులదేనని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ఎన్ని అభ్యంతరాలున్నా..ఇది మా విధానం అని కేంద్రం చెప్పలేదా? శాసన సభ అధికారాల విషయంలో కోర్టు అభ్యంతరాలు ఉంటే ఎన్నికలు ఎందుకు?. శాసన వ్యవస్థ అధికారాలను అడ్డుకుంటే ప్రజలకే నష్టం అని అన్నారాయన. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. వ్యవ స్థల్ని రక్షించే పనిని అందరూ కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రాజ్యాంగ బద్దమైన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు మాత్రమే న్యాయ వ్యవస్థకు ఉందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకానీ, శాసనం చేసే సమయంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఆ హక్కు కేవలం రాజ్యాంగం కేవలం చట్ట సభలకు మాత్రమే కల్పించిందని గుర్తు చేశారాయన. ‘కోర్టులు న్యాయం మాత్రమే చెప్పాలి. శాసనకర్త పాత్రలను కోర్టులు పోషించకూడదని సుప్రీం చెప్పింది. లేని అధికారాలను పోషించకూడదని, ప్రభుత్వాన్ని నడపొద్దు, నడపలేవు’ అని అత్యున్నత న్యాయస్థానమే పేర్కొంది అని ధర్మాన గుర్తు చేశారు.