Begin typing your search above and press return to search.

ఇప్పుడే కేటీఆర్ ఆ కోరిక తీర్చేసుకోవాల‌ట‌!

By:  Tupaki Desk   |   15 July 2019 4:34 AM GMT
ఇప్పుడే కేటీఆర్ ఆ కోరిక తీర్చేసుకోవాల‌ట‌!
X
క‌మ‌ల‌నాథులు దూకుడు పెంచారు. రెండోసారి ప్ర‌ధాని పీఠం మీద కూర్చున్న త‌ర్వాత నుంచి త‌న‌కెంత మాత్రం కొరుకుడుప‌డ‌ని ద‌క్షిణాది మీద ఆయ‌న మ‌రింత ఫోక‌స్ పెంచారు. సౌత్ లోని ఐదు రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు మిన‌హాయించి మిగిలిన నాలుగు రాష్ట్రాల మీద బీజేపీ ప్ర‌త్యేక దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్ర‌త్యేక వ్యూహాన్ని సిద్ధం చేసి.. అధికార‌ప‌క్షానికి క‌నుకు లేకుండా చేయ‌ట‌మే ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ వ్యూహంలో భాగంగా క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం తెలిసిందే.

కేర‌ళ‌లో కాస్త వెయిట్ చేసే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్న క‌మ‌ల‌నాథులు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. త‌లుపులు తెరిచేసి.. పార్టీలోకి ఎవ‌రైనా రావొచ్చ‌న్న రీతిలో ఓపెన్ గా ప్ర‌క‌ట‌న‌లు చేసేస్తున్నారు.

ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార‌ప‌క్ష అధినేత‌ల్ని టార్గెట్ చేసిన‌ట్లుగా విమ‌ర్శ‌లు షురూ చేశారు. తెలంగాణ‌లో ఇప్పటికే ఈ తీరు మొద‌లుకాగా.. ఏపీలో ఇప్పుడిప్పుడే ఆ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. ఇటీవ‌ల వెల్ల‌డైన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో.. ఊహించ‌ని రీతిలో నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవ‌టాన్ని బీజేపీ అధినాయ‌క‌త్వం సైతం అంచ‌నా వేయ‌లేక‌పోయిన‌ట్లుగా భావిస్తున్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మార‌టం.. బీజేపీ అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డ‌టం.. తెలంగాణ అధికార‌ప‌క్షాన్ని నిలువ‌రించే స‌త్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్ర‌మే అన్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంద‌న్న అభిప్రాయం క‌మ‌ల‌నాథుల్లో ఉంది. అందుకే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఢిల్లీ నుంచి అంద‌ని సాయాన్ని.. ఇక‌పై పెంచాల‌ని అగ్ర‌నేత‌లు ఫిక్స్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

మీరు దూసుకెళ్లండి.. మేం ఉన్నామంటూ మోడీషాల నుంచి అభ‌య‌హ‌స్తం అందుకున్న తెలంగాణ బీజేపీ నేత‌లు ఇప్పుడు చెల‌రేగిపోతున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా చేసిన వ్యాఖ్య‌లేన‌ని చెప్పాలి. ఎంపీగా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ధ‌ర్మ‌పురి అర‌వింద్ తాజాగా మాట్లాడుతూ.. కేటీఆర్ కు ముఖ్య‌మంత్రి కావాల‌న్న ఆశ ఉంటే ఇప్పుడే ఆ ప‌ద‌విని చేప‌ట్టాల‌న్నారు. ఎందుకంటే.. భ‌విష్య‌త్తులో కేటీఆర్ క‌ల నెర‌వేర‌ద‌ని.. తెలంగాణ‌లో బీజేపీ హ‌వా మొద‌లైన విష‌యాన్ని గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా వంద సీట్లు ఖాయంగా గెలుస్తామ‌ని చెబుతున్న అర‌వింద్ మాట‌ల్లో అతిశయం కాస్త ఎక్కువైన‌ప్ప‌టికీ.. బీజేపీని గ‌తంలో మాదిరి ఉత్త‌గా తీసేయ‌టం త‌ప్పే అవుతుందని చెప్పాలి.

పాల‌న విష‌యంలో కేసీఆర్ వైఖ‌రిపై తెలంగాణ ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్పుడున్న రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని త‌పిస్తున్నారు క‌మ‌ల‌నాథులు. ఇందులో భాగంగానే.. గ‌తంలో ఎప్పుడూ ప్ర‌ద‌ర్శించ‌నంత దూకుడును తాజాగా ఆ పార్టీ నేత‌లు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

నిజానికి ఇలాంటి జోరు వ్యాఖ్య‌లు టీఆర్ ఎస్ నేత‌ల నోట్లో నుంచి వ‌చ్చేవి. అందుకు భిన్నంగా గులాబీ నేత‌లు ఇప్పుడు నోరు విప్పేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌క‌పోతుంటే.. అందుకు భిన్నంగా బీజేపీనేత‌లు చెల‌రేగిపోతున్నారు. కేటీఆర్ సీఎం క‌ల‌ను ఇప్పుడే నెర‌వేర్చుకోవాలంటూ అర‌వింద్ చేసిన వ్యంగ్య వ్యాఖ్య‌ల‌పై గులాబీ చిన్న బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.