Begin typing your search above and press return to search.

కేసీఆర్ జీరో: బీజేపీ

By:  Tupaki Desk   |   25 Dec 2018 10:07 AM GMT
కేసీఆర్ జీరో: బీజేపీ
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యం సాధించి మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసిన గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చ‌క్రం తిప్పే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం జాతీయ రాజకీయాల్లో బీజేపీ ప్ర‌ధాన పార్టీగా ఎన్డీయే, కాంగ్రెస్ ప్ర‌ధాన ప‌క్షంగా యూపీఏ కీల‌కంగా ఉన్నాయి. అయితే బీజేపీ - కాంగ్రెస్ రెండూ లేని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను ఏర్పాటుచేయాల‌ని కేసీఆర్ యోచిస్తున్నారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్‌ ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. తాజాగా ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీల‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. మంగ‌ళ‌వారం దేశ రాజ‌ధాని దిల్లీలోనూ ప‌లువురు ముఖ్య‌నేత‌ల‌తోనూ ఆయ‌న స‌మావేశం కానున్నారు. ప్రాంతీయ పార్టీలంతా ఒక్క‌ట‌వ్వాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కిచెప్ప‌నున్నారు.

అయితే - కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాల‌ను బీజేపీ తేలిగ్గానే తీసుకుంటోంది. లోలోప‌ల ఎలా ఉందో తెలియ‌దు గానీ బ‌య‌ట‌కు మాత్రం ఏమాత్రం చింత లేన‌ట్లే మాటలు చెబుతోంది. బీజేపీ సీనియ‌ర్ నేత - కేంద్ర పెట్ర‌లోలియం, స‌హ‌జ వాయువుల శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తాజాగా కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వ్య‌వ‌హారంపై స్పందించారు. కేసీఆర్ ప్ర‌య‌త్నాల‌తో జాతీయ రాజ‌కీయాల్లో బీజేపీకి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం ఆయన ప‌డుతున్న ప్ర‌యాస మొత్తం బూడిద‌లో పోసిన ప‌న్నీర‌వుతుంద‌ని ఎద్దేవా చేశారు.

సున్నాకు సున్నాను క‌లిపితే సున్నానే వ‌స్తుంద‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ అన్నారు. కేసీఆర్ ను కూడా సున్నాగా అభివ‌ర్ణించారు. ఎంత‌గా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ జాతీయ రాజ‌కీయాల్లో బీజేపీపై కేసీఆర్ ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేరంటూ చుర‌క‌లంటించారు. వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం - న‌రేంద్ర‌ మోదీ మ‌ళ్లీ ప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అన్నారు. అయితే - కేసీఆర్ కు వ్య‌తిరేకంగా బీజేపీ అంటున్న ఈ మాట‌లు వారి వ్యూహంలో భాగ‌మే కావొచ్చ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్ వ్య‌తిరేకులుగా బ‌య‌ట‌కు క‌నిపించేందుకు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తుండొచ్చ‌ని ప‌లువురు సందేహిస్తున్నారు.