Begin typing your search above and press return to search.

ఇందిరాపార్క్ నుంచి ధ‌ర్నా చౌక్ ప్యాక‌ప్‌

By:  Tupaki Desk   |   24 Feb 2017 5:03 AM GMT
ఇందిరాపార్క్ నుంచి ధ‌ర్నా చౌక్ ప్యాక‌ప్‌
X
హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరాపార్కు సమీపంలో ఉన్న ధర్నా చౌక్‌ను మార్చాలని తెలంగాణ‌ పోలీస్ శాఖ యోచిస్తోందని స‌మాచారం. రాష్ట్ర సచివాలయం - అసెంబ్లీ - సీఎం - గవర్నర్ల క్యాంప్ ఆఫీసులు సమీపంలో ఉన్నందున శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, ధర్నాలు-ర్యాలీలతో ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతున్న దృష్ట్యా ధర్నా చౌక్‌ను ఇందిరాపార్కు నుంచి నగరశివారుకు మార్చేందుకు పోలీస్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు 50 ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు కసరత్తు చేపట్టినట్టు తెలిసింది. ధర్నాలు - ర్యాలీల వల్ల ట్రాఫిక్ స్తంభించి - తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే ధర్నా చౌక్‌ ను వేరే చోటకు మార్చాలంటూ స్థానికులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివిధ రాజకీయ పార్టీలు - పలు సంస్థలు - ఉద్యోగులు - విద్యార్థులు - కార్మికులు ధర్నాలు నిర్వహించుకునేందుకు వీలుగా నగరశివారులోని ఉప్పల్ లేదా నాగోల్‌ లో ధర్నాచౌక్‌ ను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది.

ఇటీవ‌ల తెలంగాణ జేఏసీ నిరుద్యోగ ర్యాలీ సంద‌ర్భంగా ధ‌ర్నా చౌక్‌లోనే అనుమ‌తి ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే శాంతి భ‌ద్ర‌త‌ల కోణంలో తాము అనుమ‌తి ఇవ్వవ‌ద్ద‌ని భావించిన‌ప్ప‌టికీ రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేశార‌ని గుర్తు చేస్తున్నారు. పైగా నాగోల్‌, ఉప్ప‌ల్ లో నిర్వ‌హించుకోవ‌చ్చున‌ని చెప్పిన‌ప్ప‌టికీ కానేకాదని ప‌ట్టుబ‌ట్టిన సంగ‌తి ప్ర‌స్తావిస్తున్నారు. అందుకే అనుమ‌తి విష‌యంలో ఇక నుంచి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏకంగా ధ‌ర్నా చౌక్‌నే న‌గ‌ర శివారులోకి మార్చేస్తే బాగుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ విష‌య‌మై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందిస్తుంద‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/