Begin typing your search above and press return to search.

మా ఊర్లో వైన్ షాప్ పెట్టాలంటూ ధ‌ర్నా!

By:  Tupaki Desk   |   10 March 2019 4:16 AM GMT
మా ఊర్లో వైన్ షాప్ పెట్టాలంటూ ధ‌ర్నా!
X
నిజ‌మేనండోయ్‌... ఎన్నిక‌ల వేళ ఈ ఊరోళ్ల‌కు వేరే ఎం అక్క‌ర్లేద‌ట‌. ఒక్క మ‌ద్యం షాపు కేటాయిస్తే చాల‌ట‌. ఇదేదో ఆ ఊరికి చెందిన మ‌గాళ్ల‌కు మాత్ర‌మే సంబంధించిన డిమాండ్ కాదు. ఆ ఊరి మ‌హిళామ‌ణుల‌కు కూడా ఇదే కావాల‌ట‌. విన‌డానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఆ ఊరి ప్ర‌జ‌లంతా క‌లిసి ఏకంగా జిల్లా కేంద్రానికి వ‌చ్చి మ‌రీ పురుషులు, మ‌హిళ‌లు న‌డిరోడ్డుపై ధ‌ర్నాకు దిగి ముక్త కంఠంతో వినిపించిన డిమాండ్ ఇది. ఏపీలో రాజ‌కీయంగా ప్రాధాన్య‌త క‌లిగిన జిల్లాగా ప్ర‌కాశం జిల్లాకు మంచి పేరే ఉంది. జిల్లాలో రాజ‌కీయంగా ఉద్ధండ నేత‌లు కూడా ఉన్నారు. ఇక ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లైనా, ప‌రోక్ష ఎన్నిక‌లైనా ఇక్క‌డ బ‌రి మామూలుగా ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు. ఇక త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ‌కీయంగా వేడి పుట్టించిన జిల్లా కూడా ప్ర‌కాశం జిల్లానే. ఈ జిల్లాలోని చీరాల ఎమ్మెల్యే అధికార టీడీపీని వ‌దిలి విప‌క్ష వైసీపీలోకి చేరి పెను సంచ‌ల‌న‌మే సృష్టించారు. ఈ చేరిక‌తో ఒక్క‌సారిగా రాష్ట్రవ్యాప్తంగా చేరికల జోరు పెరిగిపోయింది.

ఇంత‌టి కీల‌క జిల్లాలోనే మ‌ద్యం షాపు కావాలంటూ ఏకంగా ఊరు ఊరే త‌ర‌లివ‌చ్చిందంటే ఆశ్చ‌ర్య‌మే క‌దా. ఈ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే... జిల్లాలోని పొన్న‌లూరు మండ‌లం మాల‌పాడు గ్రామ ప్ర‌జ‌లంతా నేడు జిల్లా కేంద్రం ఒంగోలుకు త‌ర‌లివ‌చ్చారు. ఇలా త‌ర‌లివ‌చ్చిన వారిలో మ‌గాళ్ల‌తో పాటు మ‌హిళ‌లు, వృద్ధులు, యువ‌కులు, పిల్ల‌లు కూడా ఉన్నారు. మా ఊరికి మ‌ద్యం షాపు కావాలని ధ‌ర్నాకు దిగ‌డంతో.... ఇదెక్క‌డి గోల‌రా బాబూ అంటూ మీడియా అంతా అటువైపున‌కు ప‌రుగులు పెట్టింది. మీడియా ఛానెళ్ల గొట్టాలు చూడ‌గానే... అస‌లు తాము మ‌ద్యం షాపునే ఎందుకు డిమాండ్ చేస్తున్నామ‌న్న విష‌యాన్ని ఆ గ్రామ ప్ర‌జ‌లు ఏక‌రువు పెట్టారు. త‌మ గ్రామంలో మద్యం షాపు లేద‌ని, ఈ కార‌ణంగా 9 కిలో మీట‌ర్ల దూరంలోని మ‌రో గ్రామానికి వెళ్లాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇలా మ‌ద్యం కోసం దూరాబారం వెళ్లి... అక్క‌డే ఫుల్లుగా మ‌ద్యం ప‌ట్టించి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, ఈ ప్ర‌మాదాల్లో కాళ్లు చేతులు విరిగిపోతున్నాయ‌ని చెప్పుకొచ్చారు. మ‌ద్యం షాపు లేకున్నా... మ‌ద్యం మాన‌లేం క‌దా... అలాగ‌ని అల్లంత దూరం వెళితే... ప్ర‌మాదాలు స్వాగ‌తం చెబుతున్నాయి క‌దా... మా ఊళ్లోనే మ‌ద్యం షాపు పెడితే... ఇక్క‌డే తాగుతాం... ఇక్క‌డే ఉంటాం క‌దా.. అంటూ వారు త‌మ వాద‌న‌ను వినిపించారు. ఈ సంద‌ర్భంగా గ్రామానికి చెందిన మ‌హిళ‌లు కూడా త‌మ మ‌గాళ్లంతా అంత దూరం వెళ్ల‌డ‌మెందుకు? ప‌్ర‌మాదాల్లో గాయ‌ప‌డ‌టం ఎందుకు? మా ఊళ్లోనే మ‌ద్యం షాపు పెడితే స‌రిపోతుంది క‌దా అని త‌మ గ్రామ పురుషుల వాద‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. మ‌రి వీరి డిమాండ్ మేర‌కు వారి గ్రామంలో మద్యం షాపు పెడ‌తారో? లేదో? చూడాలి.