Begin typing your search above and press return to search.

సీఎం..స్లీప‌ర్ సెల్స్ ఉన్నాయి ప‌ద‌వి దిగిపో..

By:  Tupaki Desk   |   30 Aug 2017 1:30 PM GMT
సీఎం..స్లీప‌ర్ సెల్స్  ఉన్నాయి ప‌ద‌వి దిగిపో..
X
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీపై పై చేయి సాదించే ప్ర‌య‌త్నం మ‌లుపులు తిరుగుతోంది. ఇటీవల విలీనమైన అధికార అన్నాడీఎంకేలోని సీఎం పళనిస్వామి(ఈపీఎస్) - డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం(ఓపీఎస్) వర్గాల సంయుక్త గ్రూపు పార్టీ - పార్టీ ఆస్తులను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకునే దిశగా పావులు కదుపుతున్న సంగ‌తి తెలిసిందే. వచ్చేనెల12న పార్టీ సర్వసభ్య - కార్యవర్గమండలి సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించడం వంటి చ‌ర్య‌ల నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో రెబ‌ల్ వ‌ర్గానికి నేతృత్వం వ‌హిస్తున్న టీటీవీ దిర‌న‌క‌ర‌న్.. సీఎం ప‌ళ‌నిస్వామికి ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. సాధార‌ణంగా ఉగ్ర‌వాదంలో వాడే స్లీప‌ర్ సెల్స్ ప‌దాన్ని కూడా ఈ సంద‌ర్భంగా దిన‌క‌రన్ వాడ‌టం గ‌మ‌నార్హం.

21 మంది ఎమ్మెల్యేల మ‌ద్దతు దిన‌క‌ర‌న్‌ కు ఉంద‌ని - అందులో 19 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చెరిలోని రిసార్ట్‌ లో ఉంచార‌ని అంద‌రికీ తెలిసిందే. కానీ ప‌ళ‌ని వ‌ర్గంలో త‌మ‌కు చాలా మంది స‌పోర్ట్ చేస్తున్నార‌ని, ప‌ళ‌నికి దిగిపోవ‌డానికి తాము స‌మ‌యం ఇస్తున్నామ‌ని దిన‌క‌ర‌న్ అన్నారు. అంద‌రూ అనుకుంటున్న‌దాని కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్ద‌తు త‌న‌కు ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని ఏర్పాటుచేసే హ‌క్కు ఒక్క శ‌శిక‌ళ‌కే ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ప‌ళ‌ని - ప‌న్నీరు ఏర్పాటుచేయ‌నున్న స‌మావేశం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని దిన‌క‌ర‌న్ అన్నారు. పార్టీ డిప్యూటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న దిన‌క‌ర‌న్‌ను శ‌శిక‌ళ జైలుకెళ్ల‌గానే ప‌ళ‌ని వ‌ర్గం ప‌క్క‌న‌పెట్టేసింది. ఇప్పుడు స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏర్పాటు చేసి ఏకంగా శ‌శిక‌ళ‌నే పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌డానికి ప‌ళ‌ని - ప‌న్నీర్‌ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో దిన‌క‌ర‌న్ ఏకంగా హెచ్చ‌రిక స్థాయిలో చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

ఒకపక్క పార్టీ తనపై, శశికళపై వేటు వేస్తున్నా దినకరన్ చలించడం లేదు. పార్టీపై తమకే అధికారం ఉందని సీఎంతోపాటు, మంత్రులను ఒక్కొక్కరిని తానే తప్పిస్తూ తన అనుయాయులను పార్టీ నాయకులుగా నియమిస్తున్నారు. సీఎం పళనిస్వామినే ఏకంగా పార్టీ సేలం సబర్బన్ జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఆయన తొలిగించారు. దినకరన్ వర్గంతోపాటు - ప్రతిపక్ష డీఎంకే ఇప్పటికే సీఎం పళనిస్వామి సర్కారుపై విశ్వాసం లేదని ప్రకటించాయి. అవసరమైతే ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కోవలిసి రావచ్చు. కాబట్టి ఈ పరీక్షలో గెలువాలంటే శశికళను పార్టీ నుంచి సాగనంపాలి లేదా 15 నుంచి 20 మంది పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాలి. ఈపీఎస్, ఓపీఎస్ నాయకత్వంలోని సంయుక్త గ్రూపుదే అసలైన పార్టీ అని ఎన్నికల కమిషన్ గుర్తించ వలసి ఉండడం మరో ముఖ్యమైన అంశం.