Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిస్ట్‌ కు చుక్క‌లు చూపించిన కూల్ ధోని

By:  Tupaki Desk   |   1 April 2016 9:09 AM GMT
జ‌ర్న‌లిస్ట్‌ కు చుక్క‌లు చూపించిన కూల్ ధోని
X
ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఎలా చెప్పాలి? అన్న ప్ర‌శ్న చాలా క‌ష్ట‌మైంది..క్లిష్ట‌మైంది. అందునా మీడియా స‌మావేశంలో ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌టం అంత తేలికైంది కాదు. ఎందుకంటే.. ఏ చిన్న తేడా వ‌చ్చినా మొద‌టికే మోసం రావ‌ట‌మేకాదు.. అభాసుపాలు కావ‌టం ఖాయం. అలా అని ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకున్నా బాగోదు. ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్ ధోనీ ఒక విదేశీ జ‌ర్న‌లిస్ట్‌ కు త‌న కూల్ ట్రీట్‌ మెంట్‌ తో ఊహించ‌ని షాకిచ్చాడు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌ లో షాకింగ్ ప‌రాజ‌యం త‌ర్వాత మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఇలాంటి స‌మ‌యంలో ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌లు ఎదురైతే ఓ రేంజ్‌ లో కాలిపోతుంది. అలాంటిది ధోనీ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాడు. ఆస్ట్రేలియాకు చెందిన శామ్యూల్స్ ఫెర్సిస్ అనే పాత్రికేయుడు ధోనీని.. త‌న రిటైర్మెంట్ గురించి ప్ర‌శ్న వేశాడు. దీనికి రియాక్ట్ అయిన ధోనీ.. అత‌న్ని వేదిక మీద‌కు రావాల్సిందిగా కోరాడు. త‌న ప‌క్క‌నే కూర్చోబెట్టుకున్నాడు. భుజం మీద స్నేహంగా చేయి వేసి.. మాట్లాడ‌టం మొద‌లు పెట్టాడు.

నేనే రిటైర్ కావాల‌ని కోరుకుంటున్నావా? అన్న‌ధోనీ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చిన శామ్యూల్‌.. తాను కోరుకోవ‌టం లేద‌ని బ‌దులిచ్చాడు. రిటైర్ మెంట్ మీద మీరేం చెబుతారో తెలుసుకోవాల‌నుకుంటున్నా అని బదులివ్వ‌గా.. ధోనీ స్పందిస్తూ.. ఇదే ప్ర‌శ్న‌ను భార‌తీయ జ‌ర్న‌లిస్ట్‌ లు అడిగి ఉంటే.. మీ కొడుకు లేదంటే మీ త‌మ్ముడు కానీ వికెట్ కీప‌ర్ గా ఉన్నారా అని అడిగేవాడిన‌ని.. ఎందుకంటే తాను త‌ప్పుకుంటే ఆ అవ‌కాశం వారికి ద‌క్కే ఛాన్స్ ఉంటుంద‌న్నాడు. కానీ.. శామ్యూల్‌ ని తాను ఆ ప్ర‌శ్న వేయ‌లేన‌ని చెప్పారు.

ఆ త‌ర్వాత త‌న ఫిట్ నెస్ గురించి ప్ర‌శ్నిస్తే.. నేను ఫిట్ గా లేన‌ని భావిస్తున్నావా? వికెట్ల మ‌ధ్య వేగంగా ప‌రిగెత్త‌టం లేదా? అని వ‌రుస ప్ర‌శ్న‌లు వేశారు. దీనికి బుద‌లుగా.. నో.. మీరు చాలా వేగంగా ప‌రిగెడుతున్నారంటూ స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ స‌మాధాన‌మిచ్చాడు. మ‌ళ్లీ తాను క‌లుగ‌జేసుకొని 2019 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌రకూ ఆడ‌లేన‌ని భావిస్తున్నావా? అని ధోని ప్ర‌శ్నించారు. దీనికి జ‌ర్న‌లిస్ట్ రియాక్ట్ అవుతూ.. అలాంటిదేమీ లేద‌ని బ‌దులిచ్చాడు. నీ ప్ర‌శ్న‌కు నువ్వే స‌మాధానం ఇచ్చేశావ్ అంటూ కూల్‌ గా ముక్తాయించాడు. ధోనీ వైఖ‌రితో అక్క‌డి వారంతా న‌వ్వుల‌తో మునిగిపోయారు. ఇక‌..ప్ర‌శ్న అడిగిన జ‌ర్న‌లిస్ట్ ప‌రిస్థితి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదేమో..?