Begin typing your search above and press return to search.

నాడు ధోని.. నేడు శనక.. పసికూన జట్టుతో ఆసియాకప్ కొట్టిన లంక

By:  Tupaki Desk   |   12 Sep 2022 3:49 AM GMT
నాడు ధోని.. నేడు శనక.. పసికూన జట్టుతో ఆసియాకప్ కొట్టిన లంక
X
2007 వన్డే ప్రపంచకప్ లో రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో టీమిండియా తొలి రౌండ్ లోనే ఓడిపోవడంతో జట్టును ప్రక్షాళన చేశారు. ఎంఎస్ ధోని సారథ్యంలో యువ జట్టును సౌతాఫ్రికాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు పంపించారు. అస్సలు ఎవరూ గుర్తింపు లేని కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి ప్రయోగం చేశారు. కానీ ఆ అనామకులతోనే నాడు ధోని సారథ్యంలో ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి తొలి టీ20 కప్ ను అందుకున్నారు. అచ్చం అలానే సీనియర్లు దూరమైన శ్రీలంక ను ఇప్పు ఆ జట్టు కెప్టెన్ శనక ఆసియా కప్ విజేతగా నిలిపారు. కొత్త వారు.. అస్సలు పేరు లేని యువ ఆటగాళ్లతో అద్భుతాలు సాధించిపెట్టారు.

శ్రీలంక ఆసియా కప్ 2022 ఛాంపియన్‌గా నిలిచింది. కప్ గెలవడానికి శ్రీలంకకు అవకాశం ఎంత అని టోర్నీ ముందు పోల్ పెడితే '0' అని ప్రేక్షకులు తీర్పు చెప్పారు. టీమిండియాకు 60 శాతం, పాక్ కు 30 శాతం అని ఓట్లు వేశారు. అలా తక్కువ అంచనా వేసిన జట్టు శ్రీలంక ఆసియా కప్ కొట్టింది.. ఏ క్రికెట్ నిపుణుడు శ్రీలంక ఛాంపియన్ అవుతుందని ఊహించలేదు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో శ్రీలంక 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే కుశాల్ మెండిస్ ఔట్ కావడంతో శ్రీలంకకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కొద్దిసేపటికే పాతుమ్ నిస్సాంక కూడా పెవిలియన్ బాట పట్టాడు. అతని తర్వాత గుణతిలక వచ్చింది. దనంజయ డి సిల్వా, దసున్ శనక కూడా బ్యాట్‌తో ప్రభావం చూపకుండానే ఔటయ్యారు. ఒక దశలో లంక స్కోరు 58/5.

కానీ భానుక రాజపక్సే (71), వనిందు హసరంగా (36) సత్తా చాటారు. ఓటమి నుంచి జట్టును విజయపథంలో నడిపారు. 36 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారి భాగస్వామ్యం లంక ఇన్నింగ్స్‌ను నిర్మించింది. పెద్ద మొత్తం స్కోర్ చేయడంలో సహాయపడింది. హసరంగ అవుటైన తర్వాత కరుణరత్నే (14) రాజపక్సేతో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో రాజపక్సే అద్భుత అర్ధ సెంచరీ కూడా చేశాడు. అతని ప్రయత్నంతో శ్రీలంక 20 ఓవర్లలో 170/6 స్కోరు చేసింది. పాకిస్థాన్ తరఫున హరీస్ రౌఫ్ మూడు వికెట్లు (3/29) పడగొట్టాడు.

లంక బౌలర్లు అద్భుతంగా రాణించి పాక్ బ్యాటర్లను పెద్దగా స్కోర్ చేసేందుకు అనుమతించలేదు. ఛేజింగ్‌లో మహ్మద్ రిజ్వాన్ (55), ఇఫ్తికర్ అహ్మద్ (32) మినహా మరే ఇతర బ్యాటర్ రాణించలేదు. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ప్రమోద్ మదుషన్ నాలుగు వికెట్లు (4/34), హసరంగ మూడు వికెట్లు (3/27), చమిక కరుణరత్నే (2/33) రెండు వికెట్లు తీశారు.

శ్రీలంకకు ఇది 6వ ఆసియా కప్ విజయం. ఆసియా కప్ ఎడిషన్లలో అత్యధిక విజయాలు సాధించడంలో ఇప్పుడు భారత్ (7) కంటే వెనుకబడి ఉంది. ఇలా నాడు ధోని యువకులతో చేసిందే.. నేడు శనక అదే కొత్త ముఖాలతో సాధించాడు. ఫైనల్ తర్వాత తనకు ధోనినే స్ఫూర్తి అని.. అతడిలా కూల్ గా ఉంటూ వ్యూహాలు పన్నుతూ యువకులతో జట్టును గెలిపించానని చెప్పడం విశేషం. ధోనిలానే 7వ నంబర్ జెర్సీ.. అతడి స్థానంలోనే బ్యాటింగ్ చేస్తున్నానని శనక తెలిపాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.