Begin typing your search above and press return to search.

రనౌట్ ను ధోనీ ముందే డిసైడ్ చేశాడా?

By:  Tupaki Desk   |   24 March 2016 10:44 AM GMT
రనౌట్ ను ధోనీ ముందే డిసైడ్ చేశాడా?
X
ఎంతో ఉత్కంఠగా సాగి చివరి నిమిషం వరకు విజయం రెండు జట్లతో దోబూచులాడిన ఇండియా, బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ లో చివరి బంతికి రనౌట్ చేసి ఇండియా మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే... రనౌట్ చేయాలని వికెట్ కీపర్ ధోని ముందుగానే సిద్ధమయ్యాడా అనిపిస్తోంది. హార్ధిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్ చివరి బంతికి ముందు ధోనీ తీరు గమనిస్తే ఆయన డిసైడైపోయాడని అర్థమవుతుంది. బంతి వేయడానికే ముందే ధోని తన కుడిచేతి గ్లౌజ్ తీసేశాడు. సాధారణంగా వికెట్ కీపర్లు చేతులకు రెండేసి గ్లౌజులు వేసుకుంటారు. చేతికి అంటిపెట్టుకుని గ్లౌజు వేసుకుని దానిపై వదులుగా ఉండే మరో గ్లౌజు ధరిస్తారు. బంతిని పట్టుకున్న తరువాత దాన్ని విసిరే ముందు ఆ గ్లౌజ్ ను తీసేసి విసురుతారు. వదులుగా ఉండే పెద్ద గ్లౌజులు ధరించి వికెట్లను కొట్టడం కష్టం. ధోనీ ఈ మ్యాచ్ లో చివరి బంతిని పట్టుకోవడానికి ముందే విసరడానికి సిద్ధమైపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ధోనీ ముందే తన పెద్ద గ్లోవ్సును తీసేసి రనవుట్ కు సిద్ధమైనట్లుగా అనిపిస్తోంది.

ఈ ప్లానింగ్ ఇలా ఉండగా రనౌట్ చేసే క్రమంలోనూ ధోనీ తెలివిగా వ్యవహరించాడు. రెండో ఎండ్ లో ఉన్న బ్యాట్స మన్ వచ్చేలోపే 15 గజాల దూరం పరుగెత్తి ధోని రనౌట్ చేయడం విశేషం. దూరం నుంచి బంతి విసిరితే అది వికెట్లకు తగలకపోతే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదముందని గ్రహించిన టీమిండియా కెప్టెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ధోనీ ప్లానింగ్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.