Begin typing your search above and press return to search.

మిస్ట‌ర్ కూల్ రిటైర్మెంట్‌ కు టైమొచ్చిందా?

By:  Tupaki Desk   |   5 Jan 2017 6:06 AM GMT
మిస్ట‌ర్ కూల్ రిటైర్మెంట్‌ కు టైమొచ్చిందా?
X
మిస్ట‌ర్ కూల్‌ గా మ‌నమంతా పిలుచుకుంటున్న భార‌త క్రికెట్ లిమిటెడ్ ఓవ‌ర్ల జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ... నిన్న యావ‌త్తు క్రీడా ప్ర‌పంచాన్ని షాక్‌కు గురి చేశాడ‌నే చెప్పాలి. దిగ్గ‌జ క్రికెట‌ర్లంతా... 2019 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు ధోనీ వ‌న్డే - టీ20 జ‌ట్ల కెప్టెన్‌ గా కొన‌సాగుతాడ‌ని - అత‌డిలో ఇంకా స‌త్తా ఉంద‌ని కీర్తిస్తున్న త‌రుణంలో ఉన్న‌ట్లుండి నిన్న సాయంత్రం సార‌థ్య బాధ్య‌తల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు అత‌డు ప్ర‌క‌టించేశాడు. ఇప్ప‌టికే టెస్టు జ‌ట్టు ప‌గ్గాల బాధ్య‌త‌ల నుంచి వైదొల‌గిన ధోనీ... ప‌రిమిత ఓవ‌ర్ల జ‌ట్టు కెప్టెన్‌ గా కొన‌సాగుతున్నాడు. అయితే ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా నిన్న అత‌డు అందజేసిన లేఖ ఆధారంగా బీసీసీఐ... కెప్టెన్టీ ప‌గ్గాల నుంచి అత‌డు త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ నివ్వెర‌ప‌ర‌చింది. త‌న కెరీర్‌ లో క్రికెట్ ల‌వ‌ర్స్‌ కు చిర‌స్థాయిగా గుర్తుండిపోయే విజ‌యాల‌నెన్నింటినో అత‌డు సాధించాడు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు మూడు ఐసీసీ టైటిళ్ల‌ను అందించిన ఘ‌న‌త కూడా అత‌డితే. భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ల‌లో విజ‌యవంత‌మైన సార‌థిగా ధోనీకి పేరుంది. ఐసీసీ టీ20 - ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌ - ఛాంపియ‌న్స్ ట్రోఫీ వంటి మూడు కీల‌క టైటిళ్లు భారత్‌ కు ద‌క్క‌డంలో ధోనీ పాత్రే కీల‌క‌మ‌న్న విష‌యం ఏ ఒక్క‌రూ కాద‌న‌లేని స‌త్యం.

ప్ర‌స్తుతం కూడా ధోనీలో పోరాట ప‌టిమ కాని - నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కానీ ఏమాత్రం స‌న్న‌గిల్లిన దాఖ‌లా లేదు. మ‌రి అలాంట‌ప్పుడు సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి అత‌డు ఇప్ప‌టికిప్పుడు త‌ప్పుకోవాల్సిన అవ‌స‌ర‌మేమీ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొన్న టెస్టు జ‌ట్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న సంద‌ర్భంగానూ అత‌డి నుంచి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌నే వెలువ‌డింది. టెస్టు జ‌ట్టు ప‌గ్గాలతో పాటు టెస్టు కెరీర్‌ కు ఒకేసారి స్వ‌స్తి చెప్పిన ధోనీ... ఫామ్‌లో ఉండ‌గానే టెస్టు కెరీర్‌కు వీడ్కోలు ప‌లికి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. తాజాగా అత‌డు తీసుకున్న నిర్ణ‌యంపై కూడా పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ధోనీ నిర్ణ‌యాన్ని క్రికెట్ దిగ్గ‌జాలు తప్పుబ‌ట్ట‌క‌పోవ‌డం కూడా ఇక్క‌డ గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం. స‌చిన్ లాంటి మేటి క్రీడాకారులు కూడా ధోనీ నిర్ణ‌యాన్ని స్వాగతించారు. ఫామ్‌లో ఉండ‌గానే... గౌర‌వంగా కెప్టెన్సీ పగ్గాల‌ను వేరొకరికి బ‌దిలీ చేస్తూ ధోనీ మంచి నిర్ణ‌యమే తీసుకున్నాడంటూ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ అత‌డిని వేనోళ్ల పొగిడారు. కొత్త త‌రానికి అవ‌కాశం ఇచ్చేందుకే ధోనీ నిర్ణ‌యం తీసుకున్నాడంటే... త్వ‌ర‌లోనే అత‌డు పూర్తి స్థాయిలో క్రికెట్‌ కు దూరమ‌య్యే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అయితే అది ఎప్పుడు అన్న అంశమే తేలాల్సి ఉంది. 2019 వ‌ర‌ల్డ్ క‌ప్ దాకా ధోనీ జ‌ట్టులో స‌భ్యుడిగా కొన‌సాగుతాడ‌న్న ఆశ నిన్న‌టిదాకా ఉండేది. అయితే అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటూ అత‌డు తీసుకున్న నిర్ణ‌యం ద‌రిమిలా... వ‌ర‌ల్డ్ క‌ప్‌ కు ధోనీ లేకుండానే భారత జ‌ట్టు ప‌య‌న‌మ‌వుతుంద‌న్న వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/