Begin typing your search above and press return to search.

టీం ఇండియా కోసం ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ?

By:  Tupaki Desk   |   15 Nov 2022 8:33 AM GMT
టీం ఇండియా కోసం ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ?
X
అంతర్జాతీయ క్రికెట్ కు టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వీడ్కోలు పలికిన సంగతి అందరికీ తెలిసిందే. ధోని సారథ్యంలో టీం ఇండియా ఎన్నో చారిత్రాత్మక విజయాలు నమోదు చేసింది. ధోని కెప్టెన్సీలోనే టీ20 ప్రపంచ కప్.. వన్డే ప్రపంచ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్ ను టీం ఇండియా కైవసం చేసుకుంది.

మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక సారథిగా ధోని రికార్డు సృష్టించాడు. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించడంతోపాటు బ్యాట్స్ మెన్ గా.. కీపర్ గానూ ధోని సత్తా చాటాడు. బ్యాటింగ్ లో దూకుడు చూపించే ధోని.. కెప్టెన్ గా మాత్రం చాలా కూల్ గా నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్థులను పెవిలియన్ కు పంపిస్తుంటాడు.

టీం ఇండియా ఓడిపోయే మ్యాచులను సైతం ధోని ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యర్థి జట్లను తన నిర్ణయాలతో ధోని ఎన్నోసార్లు ముప్పుతిప్పలు పెట్టాడు. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లోనూ ఏమాత్రం ఒత్తిడి గురికాకుండా చాలా ప్రశాంతంగా మహేంద్ర సింగ్ ధోని నిర్ణయాలు తీసుకొని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

2020 ఆగస్టు 15న భారతీయులంతా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలోనే ధోని రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాకింగ్ గురి చేశాడు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ధోని కేవలం ఐపీఎల్ కు మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాలుగుసార్లు టైటిల్ అందించిన ఘనత ధోనికే దక్కుతుంది.

అయితే ఈ ఏడాదిలో జరిగిన ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ధోని కెప్టెన్ గా ఉన్నప్పటికీ ఆ టీం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నాటి నుంచే ధోని ఐపీఎల్ కు త్వరలో గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ధోని పలుసార్లు ఖండించారు.

ఇక త్వరలోనే ఐపీఎల్ 2023 సమరం జరుగనుంది. మార్చిలో జరిగే ఐపీఎల్ 2023 కి ధోని దూరం కాబోతున్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో టీంఇండియా సెమిఫైనల్లో ఇంటిముఖం పట్టింది. దీంతో మన క్రికెటర్లు ఐపీఎల్ లో బాగా ఆడుతారని.. ప్రతిష్టాత్మక సీరిస్ లో మాత్రం తోక మూడుస్తారనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. టీం ఇండియా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీం ఇండియాలో పలు మార్పులకు శ్రీకారం చూడుతోంది. పనిలో పనిగా మాజీ కెప్టెన్ ధోని సేవలను టీం ఇండియా కోసం వాడుకోవాలని భావిస్తోంది.

టీం ఇండియా కోచ్ గా ధోనిని తీసుకోవాలని అనుకుంటోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగానే ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై మిస్టర్ కూల్ ధోని ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.