Begin typing your search above and press return to search.

లోకేష్‌ తో ధూళిపాళ్ల భేటీ-టీడీపీ అధ్యక్షుడి చాన్స్‌!

By:  Tupaki Desk   |   4 April 2017 11:58 AM GMT
లోకేష్‌ తో ధూళిపాళ్ల భేటీ-టీడీపీ అధ్యక్షుడి చాన్స్‌!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ తాలుకూ ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ప‌లువురు త‌మ అసంతృప్తిని ఇంకా వ్య‌క్తం చేస్తుండ‌గా మ‌రికొంద‌రు అధిష్టాన పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. తాజాగా టీడీపీ యువ‌నేత‌, మంత్రి నారా లోకేష్‌ను పార్టీ సీనియ‌ర్ శాస‌న‌స‌భ్యుడు దూళిపాళ్ల నరేంద్ర క‌లిశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంపై న‌రేంద్ర అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. ఈ సమ‌యంలోనే లోకేష్ అనున‌యించార‌ని తెలుస్తోంది.

సీనియ‌ర్ ఎమ్మెల్యే, పార్టీ కోసం శ్ర‌మించిన వ్య‌క్తిని మంత్రి అయ్యేందుకు మీకు అన్ని అర్హతలు ఉన్నాయని న‌రేంద్ర‌తో లోకేష్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సమీకరణాల వల్ల ప‌ద‌వి ఇవ్వ‌డం కుదరలేదని నారా లోకేష్ స‌ముదాయించిన‌ట్లు అంటున్నారు. పార్టీకి క‌ట్టుబ‌డి ఉన్న‌వారికి ఎప్ప‌టికీ అన్యాయం జ‌ర‌గ‌ద‌ని తెలిపిన లోకేష్‌....పార్టీ నాయ‌కుడైన సీఎం చంద్ర‌బాబును ఒక‌సారి క‌ల‌వాల‌ని సూచించిన‌ట్లు చెప్తున్నారు. ఇదిలాఉండ‌గా ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను ఎంపిక చేస్తార‌ని చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు కళా వెంకట్రావును మంత్రివ‌ర్గంలోకి తీసుకోవ‌డంతో ఈ నిర్ణయం తీసుకోవ‌చ్చున‌ని తెలుగుదేశం వ‌ర్గాలు అంటున్నాయి.

మ‌రోవైపు టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం త‌న అల‌క వీడ‌టం లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీరును నిరసిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఇంకా త‌న బెట్టు వీడ‌టం లేదు. బుచ్చ‌య్య చౌద‌రిని బుజ్జ‌గించేందుకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రంగంలోకి దిగిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేద‌ని స‌మాచారం. టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్నారని చిన‌రాజ‌ప్ప‌తో బుచ్చ‌య్య చౌద‌రి ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా, చిన‌రాజ‌ప్ప‌తో భేటీ అనంత‌రం గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ...రాయబారాలు, బుజ్జగింపులు తనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. పార్టీని తిట్టిన వారిని, పార్టీ ఫిరాయించి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని బుచ్చ‌య్య చౌద‌రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు, రాసిన లేఖకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/