Begin typing your search above and press return to search.

33 జిల్లాల తెలంగాణ‌కు ఎన్ని రాజ‌ధానులు పెడ‌తావు కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   19 Jan 2020 6:08 PM GMT
33 జిల్లాల తెలంగాణ‌కు ఎన్ని రాజ‌ధానులు పెడ‌తావు కేసీఆర్‌?
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌స్తుత రాజ‌ధాని అమ‌రావ‌తి బ‌దులుగా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌నే ప్ర‌తిపాద‌న ఏపీలో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తునే ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో జ‌రిగిన కీల‌క స‌మావేశంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు - వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి భేటీని పేర్కొన‌వ‌చ్చు. ఈ స‌మావేశంలో రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి చ‌ర్చ వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఆ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. అయితే, సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని కేసీఆర్ అభినందించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది.

హైద‌రాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా ఇద్దరు సీఎంలు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు - వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి దాదాపు ఆరు గంటల పాటు విభజన సమస్యలు సహా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై - దేశ - స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అమరావతి నుంచి రాజధానిని వైజాగ్‌ కు తరలించ‌డం వ‌ల్ల వ‌చ్చే ఫ‌లితాల గురించి సైతం తీవ్రంగా చ‌ర్చ జ‌రిగినట్లు తెలుస్తోంది.

ఇదే స‌మ‌యంలో ఏపీ రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేసే విష‌యం గురించి చ‌ర్చించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌...గో అహెడ్ అన్నార‌ని ప‌లు మీడియా సంస్థ‌లు వెల్ల‌డించ‌డంపై టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర మండిప‌డ్డారు. 13 జిల్లాలు ఉన్న రాష్ట్రానికి ఈ ర‌క‌మైన స‌ల‌హాలు ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న 33 జిల్లాల రాష్ట్రానికి 6 రాజ‌ధానులు చేస్తారా? ఆ చివ‌ర ఉన్న ఆదిలాబాద్‌ - వెనుక‌బ‌డిన పాల‌మూరు అభివృద్ధికి కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు క‌దా? అంటూ వ్యాఖ్యానించారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై కూడా న‌రేంద్ర స్పందించారు. ఇన్‌ సైడ‌ర్ ట్రేడింగ్ విష‌యంలో ఆరోప‌ణ‌లు చేయ‌డం కాద‌ని...అందుకు సంబంధించి భూములు కొనుగోలు చేసిన ప్రముఖుల పేర్లను స్ప‌ష్టంగా వెల్ల‌డించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. త‌మ‌కు బినామీల జీవితం అవ‌స‌రం లేద‌ని...ఆ మాట‌కొస్తే అలాంటి ప‌రిస్థితిని ఏపీ సీఎం జ‌గ‌న్ అనుభ‌విస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.