Begin typing your search above and press return to search.

అనంతలో వజ్రాల గని తవ్వేందుకు ఓకే

By:  Tupaki Desk   |   13 Sep 2016 8:44 AM GMT
అనంతలో వజ్రాల గని తవ్వేందుకు ఓకే
X
రాయలసీమ రతనాల సీమ అని చెబుతుంటారు. నాటి మాట నిజమని తేలుతోంది. రాయలసీమ మొత్తంగా కాకున్నా.. కరువు నేలగా అందరి మనసుల్లో సానుభూతి ఉన్న అనంతపురంలో భారీ వజ్రాల గని ఉన్నట్లుగా తేలింది. ఇటీవల జరిగిన పరిశోధనలో కరవు నేలలో వజ్ర నిక్షేపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తేల్చారు. వీటి నమూనాను సేకరించి.. వాటిపై పరిశోధనలు జరిపి.. ఖరీదైన వజ్రాలు ఉన్నట్లుగా గుర్తించిన శాస్త్రవేత్తలకు.. వాటిని తవ్వి వెలికి తీయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని చెబుతున్నారు. కరువు నేలలలో ఉన్న వజ్రాల గనిని తవ్వాల్సిందిగా కేంద్ర అటవీ.. పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన అడ్వయిజరీ కమిటీ తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలంలోని పిల్లల పల్లి అటవీప్రాంతాంలోని 153 హెక్టార్ల లో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో 64 గొట్టపు బావుల సాయంతో వజ్రాల అన్వేషణ చేపడతారు. వాస్తవారిని అనంతపురం జిల్లాలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లుగా అంచనా వేసినా.. ఆ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. 1984 నుంచి అంతరిక్ష సర్వేలు సాగుతున్నాయి. తాజాగా వాటిని పక్కాగా గుర్తించిన శాస్త్రవేత్తల బృందం.. వజ్రాల వెలికితీత అవసరాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం.. దానిపై పక్కా అధ్యయనం చేసిన తర్వాత తాజాగా అనుమతులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

గతంలో జిల్లాలోని వజ్రకరూరు ప్రాంతంలో వజ్రాల గని ఉన్నట్లుగా గుర్తించి పరిశోధకులు పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. అనుకున్నంత ఎక్కువగా వజ్రాల నిల్వలు బయటపడకపోవటం.. ఖర్చు ఎక్కువ ప్రయోజనం తక్కువన్న విషయం అర్థం కావటంతో వజ్రాల వెలికితీతను వదిలేశారు. తాజాగా అందుకు భిన్నంగా వజ్రాల వెలికితీత ఖర్చు తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న అంచనాలు నిజమై.. వజ్రాల గని అనుకున్న స్థాయిలో లభిస్తే మాత్రం కరవు జిల్లా రూపురేఖలు మొత్తంగా మారిపోతాయన్న భావన వ్యక్తమవుతోంది.