Begin typing your search above and press return to search.

మొత్తానికి బీజేపీ సక్సెస్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   30 Jun 2022 4:43 AM GMT
మొత్తానికి బీజేపీ సక్సెస్ అయ్యిందా?
X
నెలల తరబడి చేసిన ప్రయత్నాల కారణంగా మొత్తానికి బీజేపీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇక్కడ ప్రయత్నాలంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీలోకి చేర్చుకోవటంలో. కొండా కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఇపుడు తటస్తంగా ఉంటున్నారు. ఎప్పుడైతే కొండా కాంగ్రెస్ కు రాజీనామా చేశారో అప్పటి నుండి ఆయన్ను బీజేపీలోకి చేర్చుకోవాలని కమలనాధులు చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్నోసార్లు భేటీలు కూడా జరిపారు. అయినా కొండా ఏ నిర్ణయమూ చెప్పలేదు.

జూలై 4 వతేదీన హైదరాబాద్ లో జరగబోయే మూడురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల ముందు కొండా బీజేపీకి తియ్యటి కబురు చెప్పారు. తాను కమలం పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.

తెలంగాణా ఇన్చార్జి తరుణ్ చుగ్, తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తో జరిగిన భేటీలో చివరకు కొండా తన నిర్ణయాన్ని చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయ్ సంకల్ప సభలో కొండా బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం.

నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఎంపీలు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఎంతోమంది కీలక నేతలు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు.

ఈ సమయంలో పార్టీలో చేరితే తనకు ప్రాధాన్యత ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే విషయంలో తగిన హామీ తీసుకున్న తర్వాతే కొండా తన నిర్ణయాన్ని చెప్పినట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. కొండాతో పాటు ఇంకా కొందరిని పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగానే కాంగ్రెస్+టీఆర్ఎస్ నేతలపై కమలనాథులు కన్నేశారు. పై పార్టీల్లోని నాయకత్వాలపై బాగా అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి అలాంటి వారితో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఎంతమందిని వీలైతే అంతమందిని మోడి సమక్షంలోనే పార్టీలోకి తీసుకోవాలనే టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. మరెంతమంది బీజేపీ చేరుతారో చూడాల్సిందే. ఎందుకంటే ఇతర పార్టీల నేతలు చేరకపోతే బీజేపీ తరపున పోటీకి గట్టి అభ్యర్ధులు కూడా దొరకరు కదా.