Begin typing your search above and press return to search.

గంటాకు లైన్ క్లియర్ చేసింది చిరంజీవినా?

By:  Tupaki Desk   |   6 Aug 2020 10:10 AM GMT
గంటాకు లైన్ క్లియర్ చేసింది చిరంజీవినా?
X
ఉత్తరాంధ్ర సీనియర్ నేత.. టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే వార్తనే ఒక సంచలనం.. ఎందుకంటే ఆయనను ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. అదే విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావుకు గంటా అంటే అస్సలు పడదు. వీరు ఇటీవలే గంటా శ్రీనివాసరావు ‘సైకిళ్ల’ కుంభకోణంలో ఇరుక్కున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కీలక వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి స్వయంగా విమర్శలు గుప్పించిన గంటాకు వైసీపీలోకి ఎంట్రీ కష్టమేనని అందరూ అనుకున్నారు.

కానీ గంటా ఇప్పుడు అనూహ్యంగా వైసీపీలో చేరబోతున్నారు. టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. గంటా శ్రీనివాస్ రావు వైయస్ఆర్సిపిలో స్వాతంత్ర్య దినోత్సవం మరునాడు చేరబోతున్నట్టు సమాచారం. తేదీ కూడా నిర్ణయించబడిందని ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 15న గంటా వైసీపీలో చేరనున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు తుది తేదీని ఆగస్టు 16గా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ చేరిక కార్యక్రమం తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో జరగబోతోందని తెలిసింది. ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే, అదే రోజు గంటా శ్రీనివాస్ రావుతో పాటు మరికొందరు టిడిపి నాయకులు కూడా వైయస్ఆర్సిపిలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారు ఎవరనేది తెలియాల్సి ఉంది.

అప్పటి వరకు గంటా శ్రీనివాస్ రావు టీడీపీకి పూర్తి దూరంగా.. వైయస్ఆర్సిపి సానుభూతిపరుడిగా కొనసాగుతారు. అతని అనుయాయులు, ఇతర నాయకులు వైయస్ఆర్సిపి యొక్క అనధికారిక పార్టీ సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిసింది.

వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు చేరిక వెనుక పెద్ద తతంగం జరిగిందంట.. ఆ జిల్లాలో ఎవరు ఒప్పుకోకపోతే గంటా చివరకు చిరంజీవిని ఆశ్రయించాడని టాక్ వినిపిస్తోంది. అప్పుడు చిరంజీవి వైసీపీ పెద్దలకు లైన్ లోకి వచ్చి గంటాకు లైన్ క్లియర్ చేశాడు అని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు గంటా వైసీపీలో చేరికకు చిరంజీవినే కారణమని వైజాగ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఆప్తుడు. ఆయన ప్రజారాజ్యాం పెట్టినప్పుడు ఆయన వెంటే గంటా ఉన్నారు. చిరుతోపాటు కాంగ్రెస్ లో గంటా విలీనం అయ్యి కొనసాగారు. కిరణ్ కేబినెట్ లో మంత్రిగా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీలోకి చిరంజీవి సాయంతో చేరబోతున్నారు. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ రావు అందరూ వ్యతిరేకిస్తున్నా గంటాను వైసీపీలోకి చేర్చేది చిరంజీవియేనని ప్రచారం జరుగుతోంది.