Begin typing your search above and press return to search.

సీఎం జగన్ ఇంటి పన్ను కట్టలేదా? ఎంతవరకు నిజం?

By:  Tupaki Desk   |   2 July 2021 6:52 AM GMT
సీఎం జగన్ ఇంటి పన్ను కట్టలేదా? ఎంతవరకు నిజం?
X
చిన్న చిన్న అంశాలే కానీ చిరాకు పుట్టిస్తుంటాయి. రాష్ట్రానికి పాలకుడిగా వ్యవహరిస్తూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తూ.. స్ఫూర్తిని ఇచ్చేలా వ్యవహరించాల్సిన వారు అస్సలు తప్పులు చేయకూడదు. వేలెత్తి చూపించుకునే అవకాశం ఇవ్వకూడదు. మరేం జరుగుతుందో కానీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన ఒక అంశం ఆసక్తికర చర్చగా మారింది.

తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంతిల్లు ఉన్న విషయం తెలిసిందే. ఇంటిని..ఆఫీసు కార్యాలయాన్ని సొంతంగా నిర్మించుకోవటం తెలిసిందే. మిగిలిన ఇళ్లకు మాదిరే.. సీఎం జగన్ నివాసానికి ఇంటిపన్ను వేశారు అధికారులు. అయితే.. దాన్ని సకాలంలో చెల్లించాల్సి ఉన్నా.. వాటిని చెల్లించలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు.. తమ ఇంటి ఆస్తిపన్ను కట్టారా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేసుకోవటం సాధ్యం కాదు. ఆ మాటకు వస్తే.. సవాలచ్చ పనులు ఉన్నప్పపుడు పన్నుల పెండింగ్ తప్పును ఆయన ఖాతాలో వేయటం సరికాదు.

కాకుంటే.. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన వారి ఆలసత్వం సీఎం జగన్ కు ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. తాజాగా కొన్ని మీడియా సంస్థల్లో సీఎం ఇంటి బకాయికి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. వాటిని కట్టేయటం ద్వారా విమర్శలకు అవకాశం ఇవ్వకూడదు. అయితే.. 2019 తొలిదశ నుంచి ఇంటిపన్ను బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. జూన్ నెలాఖరుకు మొదటి టర్మ్ పూర్తి కావటంతో జూన్ 30 వరకు ఉన్న రూ.16,67,299 బకాయిలు కాస్తా రోజు గడిచేసరికి (జులై 1) రూ.16,90,389కు పెరిగింది. అంటే.. రూ.23,090 అదనపు భారం పడిందన్నమాట.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి తాడేపల్లి ఆఫీసు.. ఇంటికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించటం లేదని.. ఈ రెండింటికి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అయితే.. జగన్ వర్గీయుల వాదన మరోలా ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రికి నివాసానికి.. కార్యాలయానికి ప్రత్యేకంగా ఉంటాయి. అందుకు భిన్నంగా.. ఏపీ ముఖ్యమంత్రి తన నివాసాన్నే అధికారిక నివాసాలుగా మార్చిన నేపథ్యంలో.. దాని బాధ్యతలన్ని ఆయా విభాగాల వారు చూడాలే తప్పించి.. ముఖ్యమంత్రికి నేరుగా సంబంధం ఉండదనే మాట చెబుతున్నారు. అయితే.. ఏదో ఒకటి చూపించి సీఎం ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్నదే ఆలోచనగా చెబుతున్నారు.