Begin typing your search above and press return to search.

మహిళ ఎంపీ దుస్తులను ఢిల్లీ పోలీసులు చింపేశారా?

By:  Tupaki Desk   |   16 Jun 2022 10:30 AM GMT
మహిళ ఎంపీ దుస్తులను ఢిల్లీ పోలీసులు చింపేశారా?
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై ఢిల్లీ పోలీసుల దాడులు చేయడం పెను దుమారానికి దారితీసింది. తాజాగా కాంగ్రెస్ మహిళా ఎంపీ ఒకరు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు తనపై దాడి చేసి తన దుస్తులను చించివేశారని ఆమె మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

నిరసనకారులతో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇదే సమయంలో వారి వైఖరిపై తమిళనాడులోని కరూర్ ఎంపీ జ్యోతిమణి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తనపై దాడి చేసి దుస్తులు చించేశారని ఆరోపించారు.

ఢిల్లీ పోలీసులు తమపై దారుణంగా దాడి చేశారన్న ఎంపీ జ్యోతిమణి.. బూట్లను లాగేసి.. దుస్తులు చించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని.. కొనుక్కునేందుకు షాపుకు వెళితే వారినీ బెదిరించారని ఆవేదన చెందారు. ఒక మహిళా ఎంపీ పట్ల పోలీసులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? అని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వీడియోను షేర్ చేసిన ఎంపీ శశిథరూర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. 'ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇది అత్యంత దారుణమైన ఘటన. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం.. ప్రతి భారతీయుడి మర్యాదకు భంగం కలిగించినట్టే.

ఇప్పుడు ఒక లోక్ సభ ఎంపీకి ఇలా జరగడం మరింత ఘోరం. ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్ దయచేసి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణ మూడో రోజు ముగిసింది. ఎల్లుండి మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు తెలిపారు. ఇవాళ రాహుల్ గాంధీని 9 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట మూడో రోజు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఆయన వెంట ప్రియాంకగాంధీ ఉన్నారు. విచారణ కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈడీ విచారణ రెండోరోజు రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేశారు.