Begin typing your search above and press return to search.

భార‌త్.. పాకిస్థాన్‌ను కొనే చాన్సు వ‌చ్చిందా?

By:  Tupaki Desk   |   26 July 2022 5:23 AM GMT
భార‌త్.. పాకిస్థాన్‌ను కొనే చాన్సు వ‌చ్చిందా?
X
తీవ్ర రుణ‌భారంతో ఓవైపు శ్రీలంక కుప్ప‌కూల‌గా.. ఇప్పుడు పాకిస్థాన్ వంతు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్ ప‌రిస్థితి కూడా శ్రీలంక‌కు భిన్నంగా లేదు. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ త‌న దేశంలో ఆస్తులను అమ్ముతామ‌ని.. వీటిని విదేశీయులు ఎవ‌రైనా కొనుక్కోవ‌చ్చ‌ని బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో భార‌త్ కు ఇది మంచి చాన్సు అని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ లో ఆస్తుల‌ను కొనుగోలు చేయొచ్చ‌ని అంటున్నారు. కొన్ని ఆస్తుల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా? లేదా అని భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని అంటున్నారు.

పాకిస్థాన్ దేశ ఆస్తుల‌ను ఎవ‌రైనా విదేశీయులు కొనుగోలు చేస్తే దానిని పాక్ జాతీయులు ఎవ‌రూ ప్ర‌జాప్ర‌యోజ‌న‌వ్యాజ్యాల రూపంలో కోర్టుకు వెళ్లి అడ్డుకోకుండా పాకిస్థాన్ ప్రభుత్వం చ‌ట్టం కూడా చేసింది. దీని ప్ర‌కారం ఎవ‌రూ కోర్టుకు వెళ్లి పాకిస్థాన్ ఆస్తులను కొనుగోలు చేసిన విదేశీయుల‌ను అడ్డుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌దు.

పాకిస్తాన్ రూపాయి ఈ వారం రోజుల్లోనే దాని విలువలో 8.3 శాతం క్షీణించింది. నవంబర్ 1998 త‌ర్వాత రూపాయి దారుణంగా దిగ‌జారింది ఇప్పుడే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌లో దుర్భ‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. శ్రీలంక దుస్థితిలోకి పాక్ కూడా జారుకుంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే దేశాన్ని ఆర్థికంగా గ‌ట్టెక్కించ‌డానికి విదేశాల‌కు దేశ ఆస్తుల‌ను విక్ర‌యించాల‌ని పాకిస్థాన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) నుంచి 1.17 బిలియన్‌ డాలర్ల రుణాలు పొందటంలో పాక్ విఫలమైంది. దేశంలో ఆర్థిక అంత‌రాల‌ను త‌గ్గించడానికి మిత్ర దేశాల నుంచి 4 బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఐఎంఎఫ్‌ సూచించింది. ఈ క్రమంలోనే ఆస్తులను విక్రయించి నిధులు సమీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది.

ఈ నేప‌థ్యంలో విదేశాల‌కు ఆస్తులు విక్రయించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ప్ర‌భుత్వం అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అన్ని ప్రక్రియల‌ను పక్కనపెట్టి.. రెగ్యులేటరీ తనిఖీలను సైతం తొలగించింది. అప్పుల‌ ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. చివ‌ర‌కు దేశంలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థల షేర్లను విదేశాలకు విక్రయించటంపై దాఖలయ్యే పిటిషన్లు విచారించే అధికారం కోర్టుల‌కు కూడా లేకుండా ప్ర‌భుత్వం చేసింది. ఈ మేర‌కు 'ఇంటర్‌ గవర్నమెంటల్‌ కమర్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌ ఆర్డినెన్స్-2022'ను పాకిస్థాన్ కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించింది.

ఈ నేప‌థ్యంలో చమురు, గ్యాస్‌ కంపెనీలు, ప్రభుత్వ అధీనంలోని విద్యుత్తు కేంద్రాల్లో వాటాను యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి విక్రయించేందుకు పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఈ అత్యవసర ఆర్డినెన్స్ తెచ్చింది. యూఏఈకి వాటాలు విక్ర‌యించ‌డం ద్వారా సుమారు 2 బిలియన్ల నుంచి 2.5 బిలియన్ల డాలర్లు పొందాలని ప్ర‌భుత్వం భావిస్తోంది.

కాగా చైనా వ‌న్ బెల్ట్ అండ్ వ‌న్ రోడ్ ఇనిషియేటివ్ ప్ర‌పంచ దేశాల‌ను ర‌హ‌దారుల‌తో అనుసంధానిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆక్ర‌మిత కాశ్మీర్ గుండా పాకిస్థాన్, ఆప్ఘ‌నిస్తాన్, ఇరాన్, ఇరాక్, ట‌ర్కీ త‌దిత‌ర దేశాల గుండా రోడ్డు మార్గంలో ఆఫ్రికా, యూరోప్ దేశాల‌కు రోడ్డు మార్గాల‌ను అనుసంధానిస్తోంది.
అయితే ఈ వ‌న్ బెల్ట్ అండ్ వ‌న్ రోడ్ ఇనిషియేటివ్ లో ర‌హ‌దారుల నిర్మాణానికి పాకిస్థాన్ వ‌ద్ద నిధులు లేవు. ఇప్ప‌టికే భారీ మొత్తంలో బ‌కాయి ప‌డింది. మ‌రోవైపు చైనాతో ఈ వ‌న్ బెల్ట్ - వ‌న్ రోడ్ వ‌ద్దంటూ బ‌లూచిస్తాన్ లో భారీ స్థాయిలో ప్ర‌జ‌లు ఉద్య‌మాలు చేస్తున్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ వివాదం పెద్ద‌దైంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో వారు త‌మ దేశ ఆస్తుల‌ను పాక్ ప్ర‌భుత్వం విదేశీయుల‌కు క‌ట్ట‌బెడితే ఊరుకునే ప్ర‌స్త‌కి లేద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకే పాక్ ప్ర‌భుత్వం తెలివిగా ఈ విష‌యంలో కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌కుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంది.

వాస్త‌వానికి పాక్ ప్ర‌జాస్వామ్య దేశ‌మూ అయిన‌ప్ప‌టికీ నియంతృత్వాన్ని త‌ల‌పించే నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హ‌మని నిపుణులు చెబుతున్నారు. చైనా.. భార‌త కంపెనీల్లో వాటాలు కొన‌డానికి సిద్ధ‌ప‌డిన‌ట్టుగా ఇండియా కూడా పాకిస్థాన్ దేశంలో ఆస్తులు కొనుగోలు చేయాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఉన్న చ‌మురు సంస్థ‌లు, గ్యాస్ సంస్థ‌లు, చైనా -పాకిస్థాన్ వ‌న్ బెల్ట్ - వ‌న్ రోడ్ ఇనిషియేటివ్ వంటివాటిలో పెట్టుబడులు పెట్ట‌డం చేయాల‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే తాను ఇచ్చిన 10 బిలియ‌న్ డాల‌ర్ల అప్పుల కింద చైనా.. పాకిస్థాన్ లో ఉన్న గ్వాద‌ర్ పోర్టును ఒడిసిప‌ట్టింది. 40 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకుంద‌ని చెబుతున్నా.. పాక్ అప్పులు చెల్లించ‌లేక చైనాకు క‌ట్ట‌బెట్టింద‌ని అంటున్నారు. గ్వాద‌ర్ పోర్టు సిటీ చైనా ప్రాంత‌మ‌ని.. ఇక్క‌డ‌కు పాక్ జాతీయులు ఎవ‌రూ అడుగుపెట్ట‌కూడ‌ద‌ని చైనా ఇప్ప‌టికే ఆంక్ష‌లు పెడుతోంద‌ని అంటున్నారు.

అలాగే మిగిలిన ఓడ‌రేవుల‌ను సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్ త‌దిత‌ర దేశాల‌కు అమ్మ‌డానికి పాక్ ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు మొద‌లుపెట్టింద‌ని పేర్కొంటున్నారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు పాక్ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా దునుమాడుతున్నాయి. మ‌రోవైపు పాక్ సంక్షోభాన్ని సావ‌కాశం తీసుకోవ‌డానికి అమెరికా కాసుకు కూర్చుంద‌ని అంటున్నారు.

అయితే పాకిస్థాన్ లో పోర్టులు, ఎయిర్‌పోర్టుల‌ను కొనుగోలు చేసినా అక్క‌డి తీవ్రవాదుల‌తో పోరాటం చేయ‌డం క‌ష్ట‌మ‌ని ఆయా దేశాలు భావిస్తున్నాయ‌ని స‌మాచారం. అలాగే అక్క‌డ వ్యాపారం చేయ‌డానికి ఎలాంటి అనుకూల ప‌రిస్థితులూ లేవ‌ని.. పాక్ ప‌ర్యాట‌క దేశం కూడా కాద‌ని విదేశీ పెట్టుబ‌డిదారులు పాక్ ఆస్తుల‌ను కొనుగోలు చేయడానికి విముఖ‌త చూపుతున్నార‌ని స‌మాచారం. దీంతో పాకిస్థాన్ మ‌ళ్లీ చైనా కాళ్ల ద‌గ్గ‌ర‌కు చేర‌డ‌మే గతి అని చెబుతున్నారు.