Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మాట కూడా మాట్ల‌డ‌రా?

By:  Tupaki Desk   |   2 Feb 2022 8:58 AM GMT
జ‌గ‌న్ మాట కూడా మాట్ల‌డ‌రా?
X
కేంద్ర బ‌డ్జెట్‌పై దేశ‌వ్యాప్తంగా అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఏ ఒక్క వ‌ర్గానికి కూడా బ‌డ్జెట్ అనుకూలంగా లేద‌ని దేశ‌వ్యాప్తంగా అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌చ్చే స‌రికి విభ‌జ‌న హామీలు నెర‌వేర్చేందుకు ప‌ద్దులో క‌నీస కేటాయింపులు కూడా లేక‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విభ‌జ‌న హామీల అమ‌లుకు మ‌రో రెండేళ్లు మాత్ర‌మే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రిపై అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం చేసిన అన్యాయంపై ఆగ్ర‌హం పెళ్లుబిగుతోంది.

ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్‌పై కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ప్ర‌ధాని మోడీపైనా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌డ్జెట్‌లో అన్యాయం జ‌రిగిన ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయినా ఇలా స్పందించ‌డం సాధార‌ణ‌మే. కానీ ప‌క్క‌నే ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. కేంద్రం వైఖ‌రిపై మండిప‌డ‌లేదు స‌రికాదు క‌నీసం బ‌డ్జెట్‌పై స్పందించ‌నే లేదు. కేసీఆర్ స్థాయిలో కాక‌పోయినా క‌నీసం రాష్ట్రానికి బ‌డ్జెట్‌లో జ‌రిగిన అన్యాయంపై జ‌గ‌న్ స్పందించాల్సి ఉంది క‌దా అని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

మ‌రోవైపు టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ వైఖ‌రిపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీజేపీ మిత్రప‌క్ష‌మైన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌డ్జెట్‌లో ఏపీ ఊసు లేక‌పోవ‌డంతో నిరాశ వెలిబుచ్చారు. కానీ అధికార వైసీపీ నుంచి మాత్రం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఏవో విమ‌ర్శ‌లు చేసి ఊరుకున్నారు. రాష్ట్ర భ‌విష్య‌త్‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వ వివ‌క్ష‌ను నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌శ్నించ‌డంలో జ‌గ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నేదానికి ఈ మౌన‌మే సాక్ష్య‌మ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు కూడా మోడీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జ‌గ‌న్ మాట్లాడ‌క‌పోవ‌డంలో అర్థ‌మేంటీ? అనే ప్ర‌శ్న‌లు ఉత్పన్న‌మ‌వుతున్నాయి.

పోల‌వ‌రానికి నిధులతో స‌హా ఎన్నో అంశాల‌పై కేంద్ర బ‌డ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయ‌ని ఆశించిన ఏపీ ప్ర‌జ‌ల‌కు నిరాశే ఎదురైంది. కానీ సీఎం జ‌గ‌న్ మాత్రం ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు. విభ‌జ‌న హామీల అమ‌లు కోసం ప‌ట్టుబ‌ట్ట‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని వ‌చ్చే ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలో తెలీక వైసీపీ పార్టీ సందిగ్ధంలో ఉంది.

త‌న‌పైన ఉన్న కేసుల భ‌యంతోనే జ‌గ‌న్‌.. కేంద్రం ఏం చేసినా చూస్తున్నారే త‌ప్ప మాట్లాడ‌టం లేద‌నే విమ‌ర్శ‌లు ఎక్కువ‌వుతున్నాయి. అందుకు రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారే త‌ప్ప ప్ర‌శ్నించ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌కు జ‌గ‌న్ ఏం స‌మాధానం చెప్తారో చూడాలి.