Begin typing your search above and press return to search.

ఏపీలో సొంత పార్టీ ఎంపీపైనే ఆ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారా?

By:  Tupaki Desk   |   20 July 2022 8:30 AM GMT
ఏపీలో సొంత పార్టీ ఎంపీపైనే ఆ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారా?
X
గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీలో అస‌మ్మ‌తి రాజుకుంద‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు, గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డికి మ‌ధ్య విభేదాలు రాజుకున్నాయ‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల‌పై ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ని గాసిప్స్ సారాంశం.

వాస్త‌వానికి అటు ఎంపీ లావు, ఇటు ఎమ్మెల్యే కాసు ఇద్ద‌రూ వైఎస్సార్సీపీకి చెందిన‌వారే. ఇద్ద‌రూ మొద‌టిసారి గెలిచిన‌వారే. గుంటూరులో ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ‌గా ఉన్న విజ్ఞాన్ విద్యా సంస్థ‌ల అధినేత లావు ర‌త్త‌య్య కుమారుడిగా లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు 2019 ఎన్నిక‌ల ముందు రాజ‌కీయ అరంగ్రేటం చేశారు. ఇక మాజీ ముఖ్య‌మంత్రి కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి మ‌న‌వ‌డిగా, మాజీ మంత్రి, ఎంపీ కాసు కృష్ణారెడ్డి త‌న‌యుడిగా కాసు మ‌హేష్ రెడ్డి రాజ‌కీయ అరంగ్రేటం చేశారు.

కాగా లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. ఈయ‌న‌తో చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే, ప్ర‌స్తుత జ‌గ‌న్ కేబినెట్ లో వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న విడ‌ద‌ల రజినికి కూడా తీవ్ర విభేదాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. త‌న‌కు చెప్ప‌కుండా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డంతోపాటు అస‌మ్మ‌తి నేత‌ల‌ను త‌న‌పైకి ఎగ‌దోస్తున్నార‌ని ర‌జ‌ని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి.

ఇక ఇప్పుడు తాజాగా గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డి వంతు వ‌చ్చిందంటున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ పెత్తనం ఎక్కువ‌గా ఉంద‌ని.. ఎమ్మెల్యేను అయిన త‌న‌ను క‌నీసం ప‌ట్టించుకోకుండా ఎంపీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న ఫిర్యాదు చేసిన‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతోంది.

కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల విష‌యంలో లావు, కాసు మ‌ధ్య విభేదాలున్నాయ‌ని అంటున్నారు.
ఇటీవ‌ల కేంద్రం నుంచి నిధులు వ‌చ్చాయ‌ని.. వీటిని ప‌ల్నాడు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రహ‌దారుల అభివృద్ధికి వెచ్చించాల్సి ఉంద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎంపీ శ్రీకృష్ణదేవ‌రాయ‌లు ఒక్క‌డే ప‌ల్నాడు జిల్లాకు వ‌చ్చార‌ని.. అధికారుల‌తో చ‌ర్చించి వివ‌రాలు సేక‌రించార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యేను అయిన‌ త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఎంపీ త‌న‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలా ప‌ర్య‌టిస్తార‌నేది గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి వాద‌న‌గా ఉంద‌ని అంటున్నారు. ఈ విష‌యంలోనే కాకుండా మొద‌టి నుంచి అనేక అంశాల్లో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

కాగా కాసు మ‌హేష్ రెడ్డి వాద‌న‌పై ఎంపీ కార్యాల‌యం కూడా ప్ర‌క‌ట‌న జారీ చేసింద‌ని చెబుతున్నారు. రాజకీయం చేయడం లేదని.. మేము అభివృద్ధే చేస్తున్నామ‌ని ఎంపీ కార్యాల‌యం ప్ర‌క‌టించింద‌ని అంటున్నారు. దీనిపైన కూడా ఎమ్మెల్యే కాసు ఫైర్ అయ్యార‌ని స‌మాచారం. అంటే తాను రాజ‌కీయం చేస్తున్నాననేగా ఎంపీ అంటోంది.. అభివృద్ధి తాను చేయ‌డం లేదా అని నిలదీసిన‌ట్టు పేర్కొంటున్నారు. మ‌రోవైపు సామాజిక‌వ‌ర్గ కోణంలోనూ ఇద్దరు నేత‌ల మ‌ధ్య విభేదాలున్నాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే కాసు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీకి టికెట్ ఇవ్వొద్ద‌ని వైఎస్సార్సీపీ అధిష్టానానికి లేఖ రాసిన‌ట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.