Begin typing your search above and press return to search.

ప్రపంచ నాయకత్వ సంక్షోభాన్ని మోదీ ముందే ఊహించారా?

By:  Tupaki Desk   |   3 March 2022 3:36 AM GMT
ప్రపంచ నాయకత్వ సంక్షోభాన్ని మోదీ ముందే ఊహించారా?
X
ప్రస్తుతం ప్రపంచమంతా ఉక్రెయిన్-రష్యా మధ్య చీలిపోయింది. రష్యాకు మద్దతిస్తున్న దేశాలు, తటస్థంగా ఉన్న దేశాలు కొన్నయితే.. ఉక్రెయిన్ తరఫున అమెరికా, యూరప్ నిలిచింది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా ప్రపంచం రెండుగా విభజితమైంది. ఈ పరిస్థితుల్లో ‘‘ప్రపంచ నాయకత్వం’’ అనేది లేకుండా పోయింది. వాస్తవానికి చెప్పాలంటే 30 ఏళ్ల కిందట సోవియట్ యూనియన్ ముక్కలై 10కి పైగా దేశాలుగా విడిపోయిన తర్వాత అమెరికానే పెద్దన్నగా మిగిలింది. సోవియట్ ముక్కలు తర్వాత రష్యా ప్రభావ రహితమైంది. ఆర్థికంగానూ ఆ దేశం కుదేలైన పరిస్థితుల్లో అమెరికా మాటే చెల్లుబాటైంది. దీనికితోడు సాఫ్ట్ వేర్ విప్లవం అమెరికాను తిరుగులేని శక్తిగా నిలిపింది. ప్రపంచ దేశాలన్నీ అహో అమెరికా అంటూ సాగిలపడాల్సిన పరిస్థితి ఎదురైంది.

అగ్ర రాజ్యం హోదాలో అమెరికా ఏం చేసినా చెల్లుబాటైంది. అఫ్గానిస్థాన్ లోకి ప్రవేశించి రెండు దశాబ్దాలు మారణ హోమం రగిలించినా.. ఇరాక్ ను కుక్కలు చించిన విస్తరిలా చేసినా, లిబియ అధినేత కల్నల్ గడాఫీని పడగొట్టినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. మరోవైపు ఈ పరిణామాలన్నిటి మధ్య రష్యా ఓ సాధారణ దేశంగా మిగిలిపోయింది. అయితే, ఎప్పుడైతే వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారో ఆ దేశ జాతకం మారడం ప్రారంభించింది. ఆర్థికంగా, ఇతరత్రా వెనుకబడినా.. ఆయుధపరంగా రష్యా ఇప్పటికీ తిరుగులేని శక్తే. అమెరికాను ఢీకొట్టగల బలశాలే. ఇక ఇప్పడు పుతిన్ నాయకత్వం, ఆర్థికంగానూ బలపడడంతో రష్యా వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోతోంది.

దీని ఫలితమే.. తన ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ఉక్రెయిన్ పై రష్యా దుస్సాహసానికి దిగేలా చేసింది. ప్రపంచం ఇప్పుడు రెండుగా చీలిపోయిందని చెప్పుకొన్నాం కదా..? ఆ విషయానికి వస్తే.. ఉక్రెయిన్ పరిణామాలకు వారం గడిచింది. భీకర యుద్ధానికి దారి తీసి ప్రపంచానికే సవాలుగా మారేలా కనిపిస్తోంది. అయితే, సరిగ్గా పది రోజుల క్రితం వరకు ఇది బెదిరింపులు, హెచ్చరికల స్థాయికే పరిమితం అయింది. అప్పటికి ఈ స్థాయి విపరిణామాలను ఎవరూ ఊహించలేదు.

ముఖ్యంగా ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుందని కూడా పసిగట్టలేకపోయారు. ఆ ఒక్కరు తప్ప.. ఆ ఒక్కరు ఎవరంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈ పరిస్థితిని పదిరోజల కిందటే అంచనా వేసినట్లు తెలుస్తోంది. గత వారం ప్రారంభంలో యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ‘‘ప్రపంచం సంక్షోభానికి గురైతే.. భారత దేశానికి చాలా బలమైన నాయకత్వం కావాలి’’ అని వ్యాఖ్యానించారు.

కొత్తగా ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవాలంటే దేశానికి సరైన నిర్దేశం చేయగల నాయకత్వం అవసరం అనేది ఆయన లెక్క. ఈ వ్యాఖ్యలు చేసిన రెండు, మూడు రోజులకే ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలైంది. అంటే, ఉక్రెయిన్ పరిణామాలను మోదీ ముందుగానే అంచనా వేశారా? అని అనిపిస్తోంది. అన్ని విధాలుగానూ జాగ్రత్తగా వ్యవహరించే మోదీ యథాలాపంగా అయితే పై వ్యాఖ్యలు చేసి ఉండరు. ఆయన మాటల వెనుక చాలా అర్థం ఉందని కూడా తరచి చూస్తే అనిపిస్తోంది.